పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకున్న వైనం
అనంతపురం జిల్లా అప్పాజిపాళ్యంలో అవ్వాతాతల ఆవేదన
ఏలూరు జిల్లా పెదవేగి, పాలగూడెంలోనూ టీడీపీ నేతల దాష్టీకాలు
కుందుర్పి/దెందులూరు/సాక్షి, టాస్క్‌ఫోర్స్/కాశీబుగ్గ: టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులు, వితంతువులపైనా తమ దర్పం చూపుతున్నారు. మంజూరైన పింఛన్ కూడా పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పాజిపాళ్యంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు మంజూరైన వృద్ధాప్య, వితంతు పింఛన్లను పంపిణీ చేయకుండా ఆ గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
పింఛన్ పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఐదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఇప్పుడు టీడీపీ నాయకులు అడ్డుచెప్పడం బాగోలేదని వృద్ధులు హనుమయ్య, అప్పాజప్ప, వితంతువు రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గురువారం జంబుగుంపల సచివాలయం ముందు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం వేలిముద్రలు కూడా వేయించుకున్న సచివాలయ ఉద్యోగులు.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో డబ్బులివ్వడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఫకృద్దీన్‌ను వివరణకోరగా, ‘వృద్ధులతో వేలిముద్రలు వేయించాం... రెండు రోజుల్లో పింఛన్ డబ్బులు ఇస్తాం’ అని సమాధానమిచ్చారు.
పింఛను సొమ్ము వచ్చినా ఇవ్వడం లేదు..
తమకు పింఛను సొమ్ము మంజూరైనప్పటికీ నగదు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన పింఛనుదారులు తాత మాణిక్యాలరావు, కాగితాల రమేష్, తాత రమాదేవి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను నగదు ఇప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
మానసిక వికలాంగురాలనే దయ కూడా లేకుండా..
అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు ఓ మానసిక వికలాంగురాలి పింఛన్‌ను నిలిపివేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. దీనికి కారణం ఆమె తండ్రి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడమేనని తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలో బొమ్మవరపు గోఖునేషు కుమార్తె మార్తమ్మ గత కొన్నేళ్లుగా పింఛన్ అందుకుంటోంది. అయితే ఈ నెల ఆమెకు పింఛన్ అందలేదు. దీనిపై ఆమె తండ్రి గోఖునేషు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడి ప్రోద్బలంతోనే తన కుమార్తె పింఛను నిలిపివేశారని వాపోయారు.
బతికుండగానే చంపేశారు..
ఓ కిడ్నీ వ్యాధి బాధితుడు బతికుండగానే చనిపోయాడని నిర్ధారించుకుని పింఛన్ ఆపేíÜన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. 5వ వార్డు ఉప్పరపేటలో ఉమ్మడిశెట్టి రామయ్య (73)కు పింఛనే జీవనాధారం. ఈ నెల అందరికీ రూ.7వేలు పింఛన్ ఇచ్చి ఆయనకు ఇవ్వలేదు. దీంతో సచివాలయ సిబ్బందిని సంప్రదించినా లాభం లేకపోయింది. మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఆయన మరణించినట్లు సచివాలయంలో రికార్డుల్లో ఉంది. అందుకే రెండు నెలలుగా పింఛన్ అందడం లేదని తెలిసింది. దీంతో రామయ్య నిశ్చేషు్టలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment