ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నేడో రేపో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది.. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల తర్వాత సామాన్యుడి వంతు వస్తుంది. ఈ నేపథ్యంలో టీకాపై సామన్యుడి ఆలోచన ఎలా ఉంది? అందుబాటులోకి వచ్చినప్పుడు వేయించుకుంటారా? వారిలో ఏ రకమైన అపోహలు, ఆందోళనలు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రయత్నం చేసింది. తెలుగు రాష్టాల్లో ఓ సర్వే నిర్వహించింది. ఏడాది కాలంగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న కరోనా మహమ్మారికి టీకా అందుబాటులోకి రావడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే టీకా వచ్చీ రావడంతోనే పలు వర్గాల నుంచి అపోహలు, ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్‌తో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అంటుంటే.. మరికొందరు తమకు ఫలానా టీకా మాత్రమే కావాలని కోరుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో మాత్రం ఈ శషభిషలు ఏమీ లేనట్లు ‘సాక్షి’సర్వే స్పష్టం చేసింది. సాక్షి.కామ్, సాక్షి ఫేజ్‌బుక్ పేజీల ద్వారా దాదాపు 4 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. దీనికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యంత్రాంగంతో మరి కొందరిని సర్వే చేసింది. ఫోన్ ద్వారా ఇంకొందరి అభిప్రాయాలను తెలుసుకుంది.
మూడు ప్రశ్నలతో సర్వే..
టీకా వేయించుకుంటారా.. లేదా? వేసుకుంటే అందుకు కారణాలు.. లేదంటే అందుకు కారణాలు చెప్పాల్సిందిగా ప్రజలను కోరాం. ఆసక్తికరంగా డిజిటల్ ప్లాట్‌ఫారంపై అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 45 శాతం మంది వ్యాక్సిన్‌కు జై కొట్టగా.. 27 శాతం మంది టీకా వేయించుకోబోమని స్పష్టం చేశారు. 28 శాతం మంది కొంతకాలం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫోన్ ద్వారా, విలేకరుల యంత్రాంగం ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో అత్యధిక శాతం మంది టీకా వేయించుకునేందుకే మొగ్గు చూపారు. ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపిన వారిలో 82 శాతం మంది వ్యాక్సిన్‌కు ఓకే చెప్పారు. కాగా, 75 శాతం మంది టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని విలేకరుల యంత్రాంగం ద్వారా తెలిసింది.
కరోనా భయం ఒక కారణం..
టీకా వేయించుకుంటామని చెప్పిన వారిలో 40 శాతం మంది కరోనా భయాన్ని కారణంగా చూపగా, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు టీకా ఉపయోగపడుతుందని నమ్ముతున్న వారు 27 శాతం మంది ఉన్నారు. వ్యాధి నుంచి తమకు టీకా రక్షణ ఇస్తుందని 11 శాతం మంది నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకో 20 శాతం మంది మాత్రం నలుగురితో పాటు తామూ అంటూ టీకాకు ఓకే చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా, సామాజిక బాధ్యత అంటూ కొందరు అభిప్రాయపడగా, మరికొందరు ఉచితంగా ఇస్తే వేయించుకుంటామని, దుష్ప్రభావాలు లేకుంటే వేసుకుంటామని మరికొందరు చెప్పడం గమనార్హం.
వేచిచూసే వాళ్లు సగం మంది!
టీకా వేయించుకునేందుకు వెనుకడుగు వేసే వారిలో దాదాపు 47 శాతం మంది కొంతకాలం వేచి చూస్తామని చెబుతున్నారు. సాక్షి.కామ్, ఫేస్‌బుక్ పేజీల్లో దాదాపు 1,787 మంది టీకా ఎందుకు వేయించుకోరో.. కారణాలు వెల్లడించారు. 650 మంది టీకాపై నమ్మకం లేకపోవడాన్ని కారణంగా చూపారు. టీకా అంటే భయమని 105 మంది, హెర్డ్ ఇమ్యూనిటీ కోసం వేచి చూస్తామని 189 మంది అభిప్రాయపడ్డారు. విలేకరుల యంత్రాంగం, ఫోన్ ద్వారా అందిన సమాచారంలో 35 శాతం మంది మాత్రమే ‘నో’ చెప్పారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment