జాతీయ రహదారిపై ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు
నాదెండ్ల: పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన సుదర్శనరావు గుంటూరు సమీపంలోని పొత్తూరు టుబాకో కంపెనీలో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు.
బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై డ్యూటీకి బయలుదేరాడు. జాతీయ రహదారిపై గణపవరం వద్ద ప్రసన్న వంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపానికి రాగానే పొగమంచు కారణంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం లారీ టైర్ల కింద నుజ్జునుజ్జవగా సుదర్శనరావు స్వల్ప గాయాల పాలయ్యాడు. వెనుక వస్తున్న వాహనాలు నెమ్మదించి రోడ్డుపై నిలిచాయి.
పొగమంచు ఉండటంతో ముందు నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో వాహనం, అశోక్‌లేలాండ్ మినీ లారీలు, కారు, ట్యాంకర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనాలు గుమిగూడటంతో ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును కొద్దిదూరంలో నిలిపాడు. ఆ వెనుకే మరో ఆర్టీసీ బస్సు నిలిచింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న లోడ్ లారీ వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో ముందు ఆర్టీసీ బస్సులోని ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.
పది వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనటంతో రెండు గంటలపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంలో రాజమమస్త్రంద్రవరానికి చెందిన లారీ క్లీనర్ ప్రసాద్ గాయాలపాలయ్యాడు. క్షతగాత్రులను 108లో చిలకలూరిపేట వైద్య శాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. మొదట ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment