నవజంట కలల పంట..థాయ్‌లాండ్‌! | Thailand surpasses Maldives as a honeymoon destination | Sakshi
Sakshi News home page

నవజంట కలల పంట..థాయ్‌లాండ్‌!

Published Mon, Nov 18 2024 5:39 AM | Last Updated on Mon, Nov 18 2024 5:39 AM

Thailand surpasses Maldives as a honeymoon destination

హనీమూన్‌ డెస్టినేషన్‌లో మాల్దీవులను దాటేసిన థాయ్‌లాండ్‌

గతేడాదితో పోలిస్తే 16% తగ్గిన మాల్దీవుల బుకింగ్స్‌  

ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు పెరిగిన బుకింగ్స్‌  

మేక్‌ మై ట్రిప్‌  హనీమూన్‌ రిపోర్ట్‌–2024లో వెల్లడి 

అత్యధికంగా ఇష్టపడుతున్న దేశాలు థాయ్‌లాండ్‌ మాల్దీవులు ఇండోనేషియా మారిషస్‌ వియత్నాం

దేశంలో అత్యధికంగా ఇష్టపడుతున్న ప్రాంతాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, కశ్మీర్‌ , గోవా, హిమాచల్‌ప్రదేశ్‌  

సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్‌ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్‌  ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్‌ స్పాట్‌­గా మారింది. ఇప్పటి వరకు హానీ­మూన్‌ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్‌ మై ట్రిప్‌ హానీమూన్‌–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్‌ 23 నుంచి సెప్టెంబర్‌–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. 

ఈ ఏడాదిలో థాయ్‌లాండ్‌ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్‌ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్‌ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్‌ మాల్దీవ్స్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. 

థాయ్‌లాండ్, మాల్దీ­వుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 

ప్రస్తుత యువత హానీమూన్‌ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్‌ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్‌ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది.  

కేరళను అధిగమించిన అండమాన్‌ 
ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్‌ నికో­బార్‌ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్‌ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్‌ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

గతేడాదితో పోలిస్తే అండమాన్‌ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్‌ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది.
   
అస్సలు తగ్గడం లేదు..   
హనీమూన్‌ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్‌ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్‌స్టార్, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్‌ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. 

కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగ­రాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement