
సాక్షి, అమరావతి: ‘ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు, నిమ్నజాతులు, క్రిష్టియన్, మైనారిటీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత, నమ్మకం, అండదండలు ఏ సీఎం ఇవ్వలేదని కచ్చితంగా చెప్పగలను’ అని సీఎం జగన్ రెండేళ్ల పాలనపై స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఎవరైనా ఈ విషయంపై చర్చకు వస్తే స్పీకర్‌గా కాకుండా ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిగా చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను.
జరుగుతున్నది కళ్ల ముందు చూస్తున్నాం. నేడు ఇంత మందికి ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా కార్పొరేషన్లు ద్వారా వెనుకబడిన వర్గాలకు నామినేట్ పదవులు ఇచ్చారు. ఇది అద్భుతం. చాలా సంతృప్తిగా ఈ వర్గాలన్నీ ఉన్నాయి. నేడు రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంది. ఆర్థిక స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందుతున్నాయి. ఇతర రాష్ట్రాల వారు కూడా ఆశ్చర్య పోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దామాషా పద్ధతిలో రాజ్యాధికారాన్ని పంచి ఇచ్చిన ఘనత జగన్‌కు మాత్రమే దక్కుతుంది’ అని వ్యాఖ్యానించారు.