
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల అంగీకారం లేకుండా, సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు ఆ డబ్బును ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చని, వీటిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం విధివిధానాలను ఖరారు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
► 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాలకు బ్యాంకులో ఉన్న అప్పు మొత్తాన్ని ఆసరా పథకం ద్వారా ఈ ఆర్థిక ఏడాది నుంచి నాలుగు విడతల్లో సంబంధిత సంఘం సేవింగ్స్ ఖాతాలో జమ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
► సంఘాల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత ఆ సంఘంలోని మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడంతో పాటు సంఘం మినిట్స్ బుక్‌లోనూ, మహిళల వ్యక్తిగత బ్యాంకు పాస్ బుక్‌లలోనూ ఆ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
► 2019 ఏప్రిల్ 11 నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంకు ఎన్‌పీఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ పథకం వర్తించదు.
సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా..
► వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల ప్రాథమిక జాబితాలను ఈనెల 25న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో తెలిపారు.
► ఈ నెల 28న స్థానికంగా సోషల్ ఆడిట్ నిర్వహించి, 29న లబ్ధిదారుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు సెర్ప్, మెప్మా వెబ్‌సైట్లలోనూ ఉంచుతారు.
► అర్హత ఉండీ ఆ జాబితాలో పేరు లేని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సెర్ప్, మెప్మాలు జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
► స్పందన కాల్ సెంటర్, సెర్ప్, మెప్మా ప్రధాన కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
సెప్టెంబర్ 11న పథకం ప్రారంభం
2019 ఏప్రిల్ 11వ తేదీ అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తేదీ నాటికి అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తేదీ నాటికి బ్యాంకర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం 9,33,180 పొదుపు సంఘాల పేరిట రూ. 27,168 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment