Mekapati Goutham Reddy- Two Multi-modal Logistics Parks In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

AP Logistics Park: రాష్ట్రంలో రాచబాట.. లాజిస్టిక్‌ హబ్‌గా ఏపీ

Published Thu, Feb 17 2022 3:24 AM | Last Updated on Thu, Feb 17 2022 8:24 AM

There are two multi-model logistics parks in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. దేశ తూర్పు తీరంలో రాష్ట్రాన్ని కీలకమైన లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టింది. అందుకోసం రాష్ట్రంలో నాలుగు భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల(ఎంఎంఎల్‌పీ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. మొదటి దశగా విశాఖపట్నం, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖతో ఒప్పందం చేసుకోనుంది.

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి బాటలు వేసేందుకు రూ.10,401 కోట్లతో నిర్మించిన 31 రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.11,157 కోట్లతో నిర్మించనున్న 20 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల వ్యవస్థ కల్పనలో కీలక ఘట్టానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా నిలవనుంది. 

మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట
► దేశ తూర్పు తీరంలో పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు లాజిస్టిక్‌ రంగమే కీలకమైందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు నెరిపేందుకు మన తీరప్రాంతం అనుకూలం. దీన్ని గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో లాజిస్టిక్‌ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. 
► అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పాలసీ 2021– 26ను తీసుకువచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల(ఎంఎంఎల్‌పీ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. వాటిలో రెండు ప్రాజెక్టులను కేంద్ర ఉపరితల రవాణా శాఖతో కలసి విశాఖపట్నం, అనంతపురంలలో ఏర్పాటు చేయనుంది.
► అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కాకినాడ, కృష్ణపట్నంలో మరో రెండు భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల(ఎంఎంఎల్‌పీ)ను నెలకొల్పనుంది. ఆ ప్రాంతాల్లో ఎంఎంఎల్‌పీల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నాయని సీబీఆర్‌ఈ కన్సల్టెన్సీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 
► మొదటి దశలో కేంద్ర ఉపరితల రవాణా శాఖతో కలిసి విశాఖపట్నం, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలు ఏర్పాటు చేయనుంది. లాజిస్టిక్‌ ఎఫీషియన్సీ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రాం కింద పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో వీటిని ఏర్పాటు చేస్తారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నం, అనంతపురంలలో అనుకూలమైన భూములను గుర్తించింది.

ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యం
► విశాఖలో ఏపీఐఐసీకి చెందిన 389.14 ఎకరాలలో లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది జాతీయ రహదారికి 8 కి.మీ దూరంలో, విశాఖ పోర్టుకు 33 కి.మీ దూరంలో ఉంది. ఈ లాజిస్టిక్‌ పార్క్‌ కేంద్రంగా విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుంది. 
► విశాఖపట్నంలోని 1,100 పరిశ్రమలతో పాటు ఆ జిల్లాలో ఫార్మాసిటీకి సమీపంలో ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలకు ఈ లాజిస్టిక్‌ పార్క్‌ కేంద్ర స్థానంగా మారనుంది. 
► లాజిస్టిక్‌ పార్క్‌ కోసం గుర్తించిన ప్రాంతానికి సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 9 వేల ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. 

భారీగా ఉపాధి అవకాశాలు
► అనంతపురంలో లాజిస్టిక్‌ పార్క్‌ కోసం ఏపీఐఐసీ 205 ఎకరాలను గుర్తించింది. ఆ ప్రదేశం కియా పరిశ్రమకు 7 కి.మీ దూరంలో, జాతీయ రహదారికి 10 కి.మీ, బెంగళూరు విమానాశ్రయానికి 142 కి.మీ దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుతో అనంతపురం జిల్లాలోని 2,700 పరిశ్రమలకు ప్రయోజనకరం. ఆటోమొబైల్, సౌర విద్యుత్తు, మినరల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నికల్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ఈ లాజిస్టిక్‌ పార్క్‌ ఉపయోగకరంగా ఉంటుంది. 
► ఈ పార్క్‌ కోసం గుర్తించిన భూములకు సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ ఆధీనంలో 3,500 ఎకరాల భూమి ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయి.

పారిశ్రామికాభివృద్ధికి ఊతం
► పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల అభివృద్ధిలో రాష్ట్రం సరికొత్త మైలు రాయిని చేరుకోనుంది. రాష్ట్రంలో మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 
► వీటిలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
► రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను సీఎం వైఎస్‌ జగన్, కేంద్రమంత్రి గడ్కరీ సంయుక్తంగా గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం మీద 51 జాతీయ రహదారుల అభివృద్ధితో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా మరింత వేగంతో దూసుకుపోయేందుకు మార్గం సుగమం కానుంది.

రవాణా వ్యయం తగ్గింపే లక్ష్యం
► ప్రస్తుతం దేశంలో ఒక వస్తువు ధరలో 13% కేవలం రవాణా వ్యయమే ఉంటోంది. ‘ఎంఎంఎల్‌పీ’ల ఏర్పాటుతో సరుకు రవాణా వ్యయాన్ని 8%కి తగ్గించాలన్నది లక్ష్యం. అందుకు ‘ఎంఎంఎల్‌పీ’లను హైవేలు, రైల్, జల రవాణాతో అనుసంధానిస్తారు.  
► ప్రస్తుతం దేశంలో సరుకు రవాణాలో 65% రోడ్డు మార్గం ద్వారానే జరుగుతోంది. ఇది ఎక్కువ వ్యయంతో కూడుకొన్నది. ఈ వ్యయం తగ్గించడానికి పారిశ్రామిక తయారీ కేంద్రాల నుంచి చిన్న వాహనాల ద్వారా సరుకును ఎంఎంఎల్‌పీలకు చేరవేస్తారు. అక్కడ నుంచి భారీ వాహనాలు లేదా చౌకగా ఉండే జల, రైల్‌ రవాణా ద్వారా పంపిస్తారు. 
► త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసుకోవచ్చు. ఎంఎంఎల్‌పీల్లో సరుకు నిల్వకు గోదాములు, శీతలీకరణ గిడ్డంగులు, ట్రక్కులు నిలిపే బే ఏరియా, డ్రైవర్లకు వసతులు, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, కస్టమ్‌ క్లియరెన్సులు, బల్క్‌ లోడింగ్‌ వంటి అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement