మూడు నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లో పంటల మునక
పలుచోట్లరోడ్లపైకి ప్రవహిస్తున్న నీరు
చుండూరు–మోదుకూరు మధ్య రాకపోకల బంద్
తెనాలి: తుంగభద్ర డ్రెయిన్ పోటెత్తింది... సమీప పంట పొలాలను ముంచెత్తింది. ఫలితంగా గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల్లోకి పంట పొలాలు మునకేశాయి. వరి పొలాలైతే చాలా చోట్ల మొనలు కూడా కనిపించడం లేదు. బీపీటీ వరిపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. కూరగాయలు, నిమ్మ, అరటి పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతోపంట నష్టం అనివార్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు నల్ల డ్రెయిన్... ఒకప్పుడు రైతుల దుఃఖదాయినిగా పేరు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువ దిగువన అదనంగా అండర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తుంగభద్ర డ్రెయినుగా మారుతుంది. వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు, ఆరెమండ్ల, తాళ్లపాలెం, పొన్నూరు, ములుకుదురు, మాచవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఎప్పుడు వరదలొచ్చినా 24 గంటల్లో డ్రెయిను సాధారణ పరిస్థితికి వస్తుంది.
అయితే ఈసారి ఆగస్టు 31, ఈ నెల 1న కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన తుంగభద్ర, వర్షాలు ఆగిపోవడంతో రెండో తేదీ తర్వాత తగ్గుముఖం పట్టింది. మళ్లీ అనూహ్యంగా 3వ తేదీ మధ్యాహ్నం నుంచి నీరు పోటెత్తింది. 36 గంటలుగా ఇదే పరిస్థితి. మార్గమధ్యంలోని వంతెనల అంచులను తాకుతూ, కట్టలపై డ్రెయిన్ పొంగిపొర్లుతూ ప్రవహిస్తోంది. మంగళగిరి, చినకాకాని, కాజ, టోల్‌గేట్ ప్రాంతాల్లోని నీరు తుంగభద్ర డ్రెయినుకు రావడమే ఇందుకు కారణం.
మరోవైపు తుంగభద్రలో కలిసే కొండేరు డ్రెయినుతో సహా పలు మురుగుకాల్వలు ఎగదన్ని పంటపొలాలను ముంచాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా తెనాలి సమీపంలోని పినపాడు–దుండిపాలెం, చుండూరు మండలంలోని నడిగడ్డపాలెం–చుండూరు, చుండూరు–మోదుకూరు గ్రామాల మధ్య రోడ్లు జలమయమయ్యాయి. చుండూరు–మోదుకూరు, నడిగడ్డపాలెం–చుండూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment