అల.. హడలెత్తిస్తోంది | Threat to ONGC onshore terminal | Sakshi
Sakshi News home page

అల.. హడలెత్తిస్తోంది

Published Sat, Jul 6 2024 5:48 AM | Last Updated on Sat, Jul 6 2024 5:48 AM

Threat to ONGC onshore terminal

ఓఎన్‌జీసీ ఆన్‌షోర్‌ టెర్మినల్‌కు ముప్పు.. వందమీటర్లు చొచ్చుకు వచ్చిన సముద్రం 

అల్లవరం: సహజ వనరుల నిక్షేపాల కేంద్రాన్ని సముద్రం చుట్టేస్తోంది. కోనసీమలో ఓఎన్‌జీసీ టెర్మినల్‌కు భారీ ముప్పు పొంచి ఉంది. కృష్ణా – గోదావరి బేసిన్‌లోని సముద్ర జలాల అడుగు భాగంలోని గ్యాస్, చమురు నిక్షేపాలను నాలుగు దశాబ్దాలుగా ఓఎన్‌జీసీ వెలికితీస్తోంది. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరానికి సుమారు 20 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంపై ఉన్న ఆఫ్‌షోర్‌ టెర్మినల్‌ నుంచి రిగ్గుల ద్వారా సుమారు 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల చమురు నిక్షేపాలను రోజూ వెలికి తీస్తోంది. ఇలా తీసిన నిక్షేపాలను పైపుల ద్వారా ఓడలరేవులోని ఆన్‌షోర్‌ టెర్మినల్‌కు తరలిస్తుంది.  

పొంచి ఉన్న ప్రమాదం 
సముద్ర అలల కారణంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. ఓడలరేవు గ్రామంలో 370 ఎకరాల్లో ఓఎన్‌జీసీ ఆన్‌షోర్‌ టెర్మినల్‌ విస్తరించి ఉంది. గ్యాస్, చమురు నిక్షేపాలను ఈ ఆన్‌షోర్‌ టెర్మినల్‌లో శుద్ధి చేసి గ్యాస్‌ను, చమురును ఆ కలెక్షన్‌ సెంటర్లకు మళ్లిస్తారు. ఈ టెర్మినల్‌కు రక్షణగా 2017లో చుట్టూ ప్రహరీ నిర్మించారు. 

టెర్మినల్‌కు దక్షిణంగా సముద్రం ఉంది. అప్పట్లో ప్రహరీకి సముద్రం కనీసం వంద మీటర్ల దూరం ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, తుపానులు, అల్పపీడనాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలకు తీరం కోతకు గురవుతోంది. ఏడేళ్లలో సముద్రం వంద మీటర్ల ముందుకు వచ్చి0ది. ప్రస్తుతం టెర్మినల్‌ ప్రహరీని సముద్రం తాకుతోంది. 

దక్షిణ, పశి్చమం రెండు వైపులా ప్రహరీని భారీ అలలు చుట్టేస్తున్నాయి. ప్రహరీ చుట్టూ నిర్మించిన బీటీ (తారు) రోడ్డు, డ్రైనేజీని సముద్రం తనలో కలిపేసుకుంది. కెరటాల ఉధృతికి ప్రహరీ కూలితే టెర్మినల్‌కు పెనుముప్పు సంభవించే అవకాశం ఉంది. అదే జరిగితే రూ.కోట్ల విలువ చేసే టెర్మినల్‌కు భారీ నష్టం తప్పదు.  

సరుగుడు తోటలు నరికేసి.. 
ఓడలరేవులో వైనతేయ నది సముద్రంలో కలిసే సంగమం నుంచి కిలోమీటరు పొడవునా సరుగుడు తోటలు విస్తరించి ఉండేవి. కాలక్రమేణా ఈ తోటలను నరికేశారు. వేరు వ్యవస్థ కనుమరుగు కావడంతో భారీ అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఆన్‌షోర్‌పై టెర్మినల్‌ నిర్మాణానికి ముందు సముద్రం ఒక కిలోమీటర్‌ దూరంలో ఉండేదని, ప్రస్తుతం ప్రహరీని తాకుతోందని స్థానికులు చెబుతున్నారు. అంటే నాలుగు దశాబ్దాల కాలంలో సముద్ర తీరం ఏ స్థాయిలో కోతకు గురైందో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. 

స్పందించకుంటే ప్రమాదమే.. 
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ తీరం పొడవునా నాలుగు కిలోమీటర్ల వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీనికి ఓఎన్‌జీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ఓఎన్‌జీసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రక్షణ గోడ నిర్మాణం అటకెక్కింది. 

ఇటీవల కాలంలో కోతకు గురైన ప్రాంతంలో స్క్వేర్‌ ట్యూబ్‌ను ఏర్పాటు చేశారు. భారీ తుపాన్ల సమయాల్లో అలలకు స్క్వేర్‌ ట్యూబులను సైతం సముద్రం తనలో కలిపేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓఎన్‌జీసీ, ప్రజాప్రతినిధులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టెర్మినల్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. 

ఓఎన్‌జీసీ నిర్లక్ష్యం 
గ్లోబర్‌ వార్మింగ్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీనివల్ల ఓడలరేవులోని ఓఎన్‌జీసీ టెర్మినల్‌ ప్రహరీని అలలు తాకుతున్నాయి. అయినా ఓఎన్‌జీసీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావడం లేదు. 2004లో సునామీ తర్వాత ఇక్కడి సముద్ర తీరం భారీ కోతకు గురైంది. వందలాది ఎకరాలు సముద్రంలో కలిసిపోయాయి. 

శాస్త్రవేత్తల బృందం ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జియో ట్యూబ్, గ్రోయిన్లు, లేదా రక్షణ గోడ నిర్మించాలని సూచించింది. ఓఎన్‌జీసీ ఈడీగా మార్బుల్‌ ఉన్న సమయంలో తీరం పొడవునా రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు.  – పాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, ఓడలరేవు, అల్లవరం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement