భోగరాజు, రేవతి మృతదేహాల వద్ద విలపిస్తున్న బంధువులు
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం పెద్దహ్యాట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పడిన పిడుగు ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిడుగుపాటుకు భార్యాభర్తలు, కుమార్తె మృతిచెందారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ భోగరాజు (36), మల్లమ్మ (30) దంపతులకు నలుగురు కుమార్తెలు. తమకున్న 4 ఎకరాల మెట్ట భూమి సాగుచేసుకుంటూ, మేకలు మేపుతూ, కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం పెద్దకుమార్తె హంసమ్మను ఇంటివద్దే వదిలి భోగరాజు, భార్య మల్లమ్మ, కుమార్తెలు రేవతి (8), మల్లేశ్వరి, వెన్నెలతో కలిసి పొలాన్ని దున్నించడానికి బాడుగ ట్రాక్టరు తీసుకెళ్లారు. మేకలను కూడా తోలుకెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడటంతో అందరూ వేపచెట్టు కిందకు చేరారు. మేకలు కూడా అక్కడికే చేరాయి. అదే సమయంలో భారీ శబ్దంతో పిడుగుపడింది. భోగరాజు, కుమార్తె రేవతి అక్కడికక్కడే మృతిచెందారు. 32 మేకలు కూడా విగతజీవులయ్యాయి.
మల్లమ్మ, మరో కుమార్తె మల్లేశ్వరి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని బంధువులు తొలుత హొళగుంద పీహెచ్‌సీకి, అనంతరం ఆదోనికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లమ్మ మృతిచెందింది. తల్లి మల్లమ్మ ఒడిలో ఉన్న చిన్న కుమార్తె వెన్నెల పిడుగుశబ్దానికి ఎగిరి దూరంగా పడింది. ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడింది. హొళగుంద ఎస్‌ఐ విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment