తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 1516 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు
పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు
తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు అడవిలో ఉన్న చిరుతపులులు రహదారులపైకి వచ్చే అవకాశముందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టంబరు నాటికి చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలిపారు. వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు చేసిన సూచనతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
వన్యప్రాణుల సంచారంతో...
దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత టూ వీలర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల విషయంలో రక్షణ చర్యలు పెంచాలని డిసైడ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తిరుమల కొండకు చేరుకునే మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమకు సహకరించాలని కోరారు. వచ్చే దారి, వెళ్లే దారిలో కూడా వాహనాలను అనుమతించరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతిస్తారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,728 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29,611 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంట సమయం పడుతుంది
Comments
Please login to add a commentAdd a comment