సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ దృశ్యాల ఘటనపై టీటీడీ సీరియస్ అయింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వివరాలు.. స్వామి వారి ఆలయానికి సంబంధించినదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంటుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది.
డ్రోన్ రైడర్ 1 (Dronerider1) అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టింగ్ తేదీ ప్రకారం నవంబర్ 13 2022లో వీడియో అప్‌లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. అనంతరం అదే వీడియోని ఐకాన్ ఫాక్ట్స్/ఐకాన్ (eyeconfacts/eyecon) అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 07, 2023లో పోస్ట్ అయినట్లు డిస్క్రిప్షన్ లో కనపడుతోంది. ఇక గృహశ్రీనివాస (gruhasrinivasa) అనే ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో అదే వీడియోని పోస్ట్ చేశారు.
క్రిమినల్ కేసులు పెడుతున్నాం..
శ్రీవారి ఆలయంపై భాగంలో గానీ, పరిసరాల్లో గానీ విమానాలు, డ్రోన్ లు తిరిగేందుకు అనుమతులు లేవు.. ఆగమ సలహామండలి సూచన మేరకూ ఆలయంపై విమానాలు, డ్రోన్ లు నిషేధం ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిన్న సోషల్ మీడియాలో స్వామి వారి ఆలయం డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో చక్కర్లు కొడుతుందని తెలిసిందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించడం జరిగిందని అన్నారు.
హైదరాబాదుకు చేందిన ఓ సంస్ధ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను పోస్టు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందన్నారు. డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల, స్టిల్ ఫోటో గ్రాఫర్ ద్వారా చిత్రీకరించిన వీడియోనా, లేక పాత చిత్రాలతో త్రిడీ లాగా రూపొందించారా? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్టింగ్ కోసం పంపామని అన్నారు.
రాబోయే నాలుగు, ఐదు రోజుల్లోనే దీనిపై ఓ క్లారీటీకి వస్తుందని, స్టిల్ కెమెరాతో ఫోటోలను మార్పింగ్ చేసి చిత్రీకరించినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందని, త్వరలోనే దీనిపై వాస్తవాలు వెలికి తీసి భక్తుల ముందు ఉంచుతామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ప్రధాన అర్చకుల స్పందన..
డ్రోన్ వివాదంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు కూడా స్పందించారు. డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూ ను బంధించినట్లు సామాజిక మాధ్యమాలలో ప్రసారం అవుతుందని, సంప్రదాయంలో భాగంగా కొన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్నామని, గుర్తు తెలియని వ్యక్తులు నియమనిబంధనలు అతిక్రమించి డ్రోన్ ద్వారా దేవాలయాన్ని చిత్రీకరించారని ప్రధాన అర్చకులు పేర్కొన్నారు.
దివ్య శక్తితో వెలసిన స్వామి వారి ఆలయంపై ఎగురరాదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. తిరుమల క్షేత్రం అంతా డ్రోన్స్, విమానాలను ప్రయాణించరాదనే నిబంధనలు ఆగమశాస్త్రం చెపుతోందన్నారు.
చదవండి: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment