
అన్నదాన సత్రం వరకు బారులు తీరిన భక్తులు
తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో వీఐపీలు తిరుమల యాత్ర విషయంలో పునరాలోచించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
క్యూలైన్ల తనిఖీ
టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఈవో వెంట అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment