తిరుమల: ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం గురువారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో ఉన్న శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథ ముఖ్య అతిథిగా హజరై ఉపన్యసించారు.
తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇతర కైంకర్యాలు చేసి తిరుమల తొలి పౌరుడిగా శ్రీ తిరుమలనంబి నిలిచారని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అని చెప్పారు.
తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా తిరుమలనంబికి సంబంధించిన విశేష అంశాలతో రచించిన తిరుమలనంబి దివ్యచరితామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
విజయవాడకు చెందిన పాలకొలను వెంకటరామిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులో రచించారు. దీన్ని గిద్దలూరుకు చెందిన గంటా మోహన్ రెడ్డి ఇంగ్లీషులోకి, బెంగళూరుకు చెందిన రంజని కన్నడ భాషలోకి అనువదించారు.
Comments
Please login to add a commentAdd a comment