పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పిలిచా
ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి.. మాకు అండగా నిలిచారు
అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు
నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆరోజు నేనే మీడియా ముందుకు వచ్చా
నేను చదువుకోలేదు.. పోలీసులు సంతకం చేయమంటే చేశా
దానిని ఉపయోగించుకొని చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు
ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాం
‘ఎర్రావారిపాలెం’ బాలిక తండ్రి వెల్లడి
చెవిరెడ్డిపై పోక్సో తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయింది: భూమన కరుణాకర్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ నేతల గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆగ్రహం
ఎవరి కళ్లల్లో ఆనందం చూడటానికి తప్పుడు కేసులు పెడుతున్నారో పోలీసులు చెప్పాలని డిమాండ్
ఏదైనా జరిగితే పరామర్శకు వెళ్లకూడదనే ఇలా చేస్తున్నారా? అని మండిపాటు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్లి, న్యాయం కోసం నిలబడిన వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసు వెనుక ‘అసలు నిజం’ బయటపడింది. బాలిక తల్లిదండ్రులు రమణ, అరుణ ఆదివారం మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించారు. తాను ఎవ్వరిపైనా కేసు పెట్టలేదని బాలిక తండ్రి రమణ స్పష్టం చేశాడు.
తాను చదువుకోలేదని.. మీడియా వాళ్లు తమ వద్దకు రాకుండా చూస్తామంటూ పోలీసులు తనతో సంతకం చేయించుకున్నారని వెల్లడించాడు. తీరా చూస్తే తమ కుటుంబానికి అండగా నిలిచి.. సాయం చేసిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైనే తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారని తెలుసుకొని షాక్‌కు గురయ్యానని చెప్పాడు. తాను పిలిస్తేనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వచ్చారని.. అటువంటి వ్యక్తిపై తానెలా కేసు పెడతాను? అని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు..
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం యలమందకు చెందిన ఓ బాలికపై ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాలిక తండ్రి అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యలమందకు వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కానీ చెవిరెడ్డితో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నేత నాగార్జునరెడ్డి, తదితరులపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఆశ్రయించారు. అసలు వాస్తవమేంటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నామని చెప్పడంతో.. బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు ఆదివారం తిరుపతిలో వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాలిక తండ్రి రమణ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
మీడియా పేరు చెప్పి.. కాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారు
‘‘మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు పెట్టాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చెవిరెడ్డి ఒక్కరి మీదే కాదు.. అక్కడకు వచ్చిన వారెవ్వరి మీదా నేను ఫిర్యాదు చేయలేదు. నా బిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు ఆ కేసును తారుమారు చేస్తారన్న భయంతో.. నేనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నాను. నేను పిలిస్తేనే ఆయన వచ్చారు. అలాంటి వ్యక్తి మీద నేను ఎందుకు కేసు పెడతా? నా బిడ్డకు ఏదో అన్యాయం జరిగిందని వచ్చిన వ్యక్తి మీద నేను కేసు పెట్టాననడం పాపం కదా! నేను ఎవ్వరి మీదా కేసు పెట్టలేదు. నాకేమో చదువురాదు.
పోలీసులు నా దగ్గరకు వచ్చి.. ‘మీడియా వాళ్లు మీ పాప గురించి పదేపదే అడుగుతున్నారు.. వాళ్లు పోస్టులు పెట్టకుండా ఉండాలంటే ఈ కాగితంలో సంతకం పెట్టు’ అని నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు.
పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని తెలిసి బాధపడ్డాం..
బాలిక తల్లి అరుణ మాట్లాడుతూ.. ‘మా బిడ్డకు ధైర్యం చెప్పి మాకు అండగా నిలిచేందుకు వచ్చిన చెవిరెడ్డి మీద తప్పుడు కేసు పెట్టడం దారుణం. పోలీసులు ఇలా చేస్తారని మాకు తెలియదు. ఒక కాగితం మీద సంతకం పెట్టమని పోలీసులు అడిగితే.. నా భర్త సంతకం పెట్టారు. దానిని ఉపయోగించుకొని ఇదంతా చేశారని తెలిసి బాధపడ్డాం’ అని చెప్పారు.
అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు..
నా బిడ్డ విషయం చెప్పగానే చెవిరెడ్డి.. యల్లమందలోని ఆస్పత్రికి వచ్చారు. ఏం జరిగిందని నన్ను అడిగితే.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నా బిడ్డపై అఘాయిత్యం చేశారని చెప్పా. ఆయన ఆస్పత్రి లోపలకు వెళ్లి.. అక్కడ పోలీసులు పాపను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ‘లేడీ పోలీసు రావాలి కదా.. మీరెలా విచారిస్తారు’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత చెవిరెడ్డి బయటకు వచ్చేశారు. నేను అక్కడ మీడియా వాళ్లతో పాపకు జరిగిన అన్యాయం గురించి చెబుతా ఉంటే.. చెవిరెడ్డి నన్ను పిలిచి.. ‘పాప విషయం కదా.. భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించుకో’ అని నాతో అన్నారు.
ఏం కాదులే అన్నా.. ఇంతకన్నా ఏమవుతుందన్నాను. నా బిడ్డ శరీరం మీద రక్తగాయాలు చూసి నా మనస్సుకు బాధ కలిగి నేనే మీడియా వాళ్ల ముందుకు వెళ్లా. నా బిడ్డను ఇలా చేసిన వారిని ఉరితీయాలని, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని చెప్పా. మా బిడ్డ గురించి చెవిరెడ్డి ఎక్కడ కూడా అత్యాచారం జరిగిందని చెప్పలేదు. మమ్మల్ని ఎక్కడా కించపరచలేదు. మా పరువుకు నష్టం కలిగించేలా ఏమీ చేయలేదు. పాపకు మెరుగైన వైద్యం కావాలంటే.. ఎక్కడకు తీసుకెళ్లినా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయనపై నేను కేసు పెట్టాననడం దారుణం’’ అని బాలిక తండ్రి రమణ వాపోయాడు.
ప్రభుత్వం కుట్ర బయటపడింది: భూమన
ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ఉపయోగిస్తూ.. వ్యక్తులి్న, వ్యవస్థలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చెవిరెడ్డిపై పెట్టిన ‘పోక్సో’.. తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వం కుట్ర పూర్తిగా బయటపడిందన్నారు. అసలు బాధిత కుటుంబానికే తెలియకుండా కేసులు పెట్టారంటే.. ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి పోలీసులు ఇదంతా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సభ్యసమాజంలో ఎవరైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా? అని భూమన నిలదీశారు. ఎవరికైనా ఏదైనా జరిగితే పరామర్శకు వెళ్లకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారా? అని ప్రశి్నంచారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment