సీఎం జగన్‌ ధర్మాన్ని నిలబెట్టారు | TTD Chief Priest Ramana Dishitulu Comments About CM Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ధర్మాన్ని నిలబెట్టారు

Published Wed, Apr 7 2021 3:24 AM | Last Updated on Wed, Apr 7 2021 3:58 AM

TTD Chief Priest Ramana Dishitulu Comments About CM Jagan - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు

సాక్షి, అమరావతి: అర్చకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఆయన తోటి అర్చకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని.. భగవంతుని ఆశీస్సులతో సీఎం ఆ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. సీఎం జగన్‌కు ఈ విషయంలో తామెంతో రుణపడి ఉన్నామని.. గతంలో ఇచ్చిన హామీనీ ఆయన నెరవేర్చారని, సీఎం పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం జగన్‌ ద్వారా వస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. 

సీఎం ఆదేశాలతో మళ్లీ శ్రీవారి సేవ
మిరాశీ దేవాలయాల్లో వేల సంవత్సరాలుగా పలువురు అర్చకులు వంశపారంపర్యంగా సేవలందిస్తూ వచ్చారని.. దురదృష్టవశాత్తూ ఇటీవల వంశపారంపర్య అర్చకత్వానికి అడ్డంకులు సృష్టించారని.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో తమకందరికీ తిరిగి స్వామివారి కైంకర్యాలు చేసుకునే మహద్భాగ్యం కల్గిందని రమణదీక్షితులు సంతోషం వ్యక్తంచేశారు. ప్రతి పాలకుడిలో విష్ణు అంశ ఉంటుందని.. సీఎం జగన్‌ విష్ణుమూర్తిలా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారని కొనియాడారు.  పదవీ విరమణను తొలగించి తిరిగి తమను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎంకు అర్చకులందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఆయన తెలిపారు.
క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, ఇతర అర్చకులు 

ముఖ్యమంత్రి కుటుంబం సంతోషంగా ఉండాలని.. మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఆయన ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అర్చకుల కుటుంబాలకు భూములివ్వడం సహా దేవాలయాల్లో ధూపదీపాలు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎంను కోరామని రమణదీక్షితులు చెప్పారు. సనాతన ధర్మం కాపాడుతూ మరింత జనరంజకంగా ముఖ్యమంత్రి పాలించాలని దైవాన్ని నిత్యం ప్రార్థిస్తామన్నారు. కాగా, టీటీడీ విషయాలను రాజకీయం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని స్పష్టంచేశారు. పింక్‌ డైమండ్‌ మాయం అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రమణదీక్షితులు చెప్పారు. 

సీఎంతో మర్యాదపూర్వక భేటీ
అంతకుముందు.. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానార్చకులు రమణదీక్షితులు, ఇతర అర్చకులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించడంపై సీఎం జగన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement