మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు.
ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు.
వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment