మొక్కుబడిగా హంద్రీ–నీవానీటి విడుదల
12 పైపులకు మధ్యాహ్నం ఆన్‌చేసింది 2.. గంటలోపే స్విచ్ ఆఫ్
మళ్లీ రాత్రి ఒక్క పంపు ఆన్ చేసి 337.6 క్యూసెక్కుల విడుదల
‘సీమకు అన్యాయంపై నోరు విప్పని మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: హంద్రీ–నీవా నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. సకాలంలో నీళ్లివ్వకుండా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందకుండా చేస్తోంది. కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని ‘సాక్షి’ రెండు రోజులుగా ఎండగట్టడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హంద్రీ–నీవా ఎస్‌ఈ రామగోపాల్ మల్యాల పంప్‌హౌస్ వద్ద పూజలు చేసి రెండు పంపులు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పైపులకుగానూ కేవలం రెండు పంప్‌లు మాత్రమే ఆన్ చేయడం గమనార్హం.
అయితే గంటలోపే స్విచ్ ఆఫ్ చేసి నీటి విడుదలను నిలిపివేశారు. మల్యాల నుంచి నీళ్లు బ్రాహ్మణకొట్కూరు సమీపంలోకి రాగానే పంపులు స్విచ్ ఆఫ్ చేశారు. మళ్లీ రాత్రి ఏడున్నర గంటల సమయంలో హడావుడిగా ఒక్క పంపు ఆన్ చేసి 337.6 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తుండటంతో కొత్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కాకపోయినా నీటిని విడుదల చేశారు. పాత అప్రోచ్ రోడ్డును జేసీబీలతో తొలగించారు.
500 క్యూసెక్కులు కూడా కష్టమే!
కొత్తగా నిర్మించిన అప్రోచ్ రోడ్డులో 13 చిన్న సైజు సిమెంట్ పైపులను అమర్చారు. కాలువలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు 2,200–2,500 క్యూసెక్కులు ప్రవహించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు అమర్చిన చిన్న పైపులతో 500 క్యూసెక్కులు కూడా ప్రవహించడం కష్టమేనని తెలుస్తోంది.
పాత అప్రోచ్ రోడ్డు నిర్మాణ సమయంలో నీరు ప్రవహించేందుకు వీలుగా పుట్టా సంస్థ పైపులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 45 చోట్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే గెలిచినా సీమ రైతన్నల ప్రయోజనాలను కాపాడేందుకు గొంతు విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment