మృతులు మహంతి, సతీష్ కుమార్ (ఫైల్)
అనకాపల్లి: జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బీమ్‌లు జారిపడడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్‌లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్ ట్యాంకర్‌పై పడ్డాయి.
కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ముందు కూర్చున్న విజయనగరానికి చెందిన సతీష్‌కుమార్ (34), బనిత మహంతి (35) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారులో వెనుక కూర్చున్న ముగ్గురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో వెలికితీశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
దర్శనానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం..
సతీష్‌కుమార్ (34), ఆయన భార్య సునీత, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో పనిచేసే బనిత మహంతి (35), భార్య సుశాంత్, మహంతి అత్త దమయంతి ఒకే కారులో కలిసి వచ్చి అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశానికి చెందిన డీబీఎల్ కంపెనీ ఈ పనులను చేస్తోంది. రహదారులను విస్తరిస్తూ అవసరమైన చోట బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు నిర్మిస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment