Expansion of National Highways
-
భారత్ మాల @ రూ.10.63 లక్షల కోట్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాలా (జాతీయ రహదారుల విస్తరణ) ప్రాజెక్టు తీవ్ర జాప్యాన్ని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 23 శాతం పనులే కాగా, 2028 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాస్తవానికి 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించగా సాధ్యపడలేదు. ఆరేళ్లు ఆలస్యంగా, అది కూడా ముందు అంచనాలకు రెట్టింపు వెచ్చిస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. అది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే వ్యయాలు రెట్టింపు అవుతాయన్నది అంచనా. భూముల ధరలు, ఇన్పుట్ వ్యయాలను కూడా కలిపి చూస్తే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 15–20 శాతం మేర వ్యయాలు పెరిగిపోవచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. భూ సమీకరణ పెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. ప్రాజెక్టులో 60 శాతానికే అవార్డ్ భారత్‌మాలా ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 34,800 కిలోమీటర్లు కాగా, ఇందులో 60 శాతానికే అంటే 20,632 కోట్ల మేర రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డర్లు (2021 డిసెంబర్ నాటికి) ఇచ్చింది. భూ సమీకరణలో సమస్యలు, భూముల కొనుగోలు వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం, కరోనా మహమ్మారిని ప్రాజెక్టు జాప్యానికి కారణాలుగా ఇక్రా తెలియజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అదనపు రుణాల సమీకరణను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. రహదారుల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయిస్తామని, చిన్న ఇన్వెస్టర్లకు 8 శాతం వడ్డీని ఆఫర్ చేసి తగినన్ని నిధులను సమీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ గతవారమే ప్రకటించడం గమనార్హం. భారత్‌మాలా కింద పూర్తి విస్తీర్ణం మేరకు రహదారుల నిర్మాణ అవార్డులను జారీ చేయడం 2024 మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్రా అంచాన వేస్తోంది. ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంటే ఇది 2025 మార్చి వరకు పట్టొచ్చని తెలిపింది. ఏటా 4,500–5,000 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగితే 2028 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంది. -
కూలిన ఫ్లైఓవర్ బీమ్‌లు
అనకాపల్లి: జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బీమ్‌లు జారిపడడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్‌లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ముందు కూర్చున్న విజయనగరానికి చెందిన సతీష్‌కుమార్ (34), బనిత మహంతి (35) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారులో వెనుక కూర్చున్న ముగ్గురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో వెలికితీశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. దర్శనానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం.. సతీష్‌కుమార్ (34), ఆయన భార్య సునీత, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో పనిచేసే బనిత మహంతి (35), భార్య సుశాంత్, మహంతి అత్త దమయంతి ఒకే కారులో కలిసి వచ్చి అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశానికి చెందిన డీబీఎల్ కంపెనీ ఈ పనులను చేస్తోంది. రహదారులను విస్తరిస్తూ అవసరమైన చోట బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. -
365లో 420 పనులు
సాక్షి, హన్మకొండ : భారీ వాహనాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత నాణ్యత ప్రమాణాల ప్రకారం జాతీయ రహదారి పనులు చేపట్టాలి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా మీదుగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి పేరు చెబుతూ గ్రామీణ రోడ్ల స్థాయిలో పనులు చేపడుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సన్నకంకర, గ్రానైట్ శాండ్ (జీఎస్బీ, గ్రాన్యుల్ సబ్ బేస్) మిశ్రమంతో ప్రాథమిక స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉండగా... చవగ్గా లభిస్తుందనే ఉద్దేశంతో ఎర్రమట్టితోనే రోడ్డు నిర్మాణం చేపడతున్నారు. సమీపంలో ఉన్న గుట్టల నుంచి అక్రమంగా ఎర్రమట్టి తవ్వి రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి దాదాపు కోటిన్నర రూపాయలు వెచ్చిస్తున్నా... పట్టపగలే నాసిరకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా... అధికార యంత్రాంగం కళ్లుమూసుకుని చోద్యం చూస్తోంది. మొదటిదశలో 80 కి.మీలు ప్రస్తుతం వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్తోంది. కొత్తగా మరో జాతీయ రహదారిని జిల్లా మీదుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి మన జిల్లాలో భూపాలపల్లి మండలంలో ప్రవేశించి మరిపెడ మండలంలో ముగుస్తుంది. జిల్లాలో 220 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణాన్ని భూపాలపల్లి-పరకాల-ఆత్మకూరు, ములుగు మండలం మల్లంపల్లి-మరిపెడ, మరిపెడ- నల్గొండ జిల్లా నకిరేకల్ మధ్య మొత్తం మూడు పనులుగా విభజించారు. మొదటిదశలో మల్లంపల్లి-మరిపెడ మధ్య ఉన్న 80 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను రూ. 127 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయూనికీ గండి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నల్లబెల్లి మండలం కన్నారావుపేట, గుండ్లపహాడ్ గ్రామాల సమీపంలోని రాజన్నగుట్టల నుంచి అనుమతులు పొందకుండా ఎర్రమట్టిని తవ్వుతున్నారు. ఇక్కడ మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కానీ... సర్కారు రికార్డుల్లో ఉన్న గుట్టల్లో మైనింగ్ చేపడుతూ ప్రొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో యథేచ్ఛగా ఎర్ర మన్ను తరలించుకుపోతున్నారు. నెలరోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిగా సాగుతున్న మైనింగ్ కారణంగా గుట్ట హరించుకుపోతోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సినఆదాయానికి గండి పడుతోంది.