నెల్లూరులోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద చేరిన నీళ్లలో వెళ్తున్న కార్లు, ఫుట్‌పాత్‌పై మోటార్ సైక్లిస్టులు
సాక్షి, నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు నిండుకోగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్‌లో 8 గేట్లను ఎత్తివేసి 85–క్యూసెక్కుల మేరకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికి 1,398 చెరువులు పూర్తిగా నిండి పొర్లుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇందుకూరుపేట మండలం గంగపట్నం–పల్లెపాళెం గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది. నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్ సోమవారం ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. సోమశిల ప్రాజెక్ట్‌కు సాయంత్రానికి 11 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరుతోంది.
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి 1.5 కి.మీ. ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో తిరుపతిలో 15 సెం.మీ., గూడూరు, కావలిలో 9, పలమనేరులో 8, రాపూరు, కందుకూరు, ఉదయగిరి, సత్యవేడులో 7, శ్రీకాళహస్తిలో 6, నెల్లూరు, తొట్టంబేడు, అట్లూరు, వెంకటగిరి కోటలో 5, అవనిగడ్డ, ఆత్మకూరు, వెంకటగిరి, మచిలిపట్నం, బద్వేలు, కోడూరు, పెనగలూరులో 4 సెం.మీ. నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment