South Coastal Andhra
-
రేపు తీవ్ర అల్పపీడనం.. దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం(అక్టోబర్14) అల్పపీడనం ఏర్పడింది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 35- 45కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. -
కోస్తాంధ్రపై ‘మిచాంగ్’ తుపాను పడగ!
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కి.మీలు, తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90 కి.మీలు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగనుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సçహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని తెలిపారు. -
ఏపీకి వర్షసూచన.. నాలుగు రోజులు వానలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో చెదురుమదురుగా వానలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ గురువారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
దక్షిణ కోస్తా వైపు వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అది అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్ వైపుగా వెళ్లి జంషెడ్‌పూర్‌కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
ఏపీ: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడిన రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల రెండు లేదా మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయనీ, ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోనున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. వేపాడలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా, ఆనందపురంలో 8.8, కె.కోటపాడులో 7.2, సంతబొమ్మాళిలో 7.1, యర్రగొండపాలెంలో 6.3, మందసలో 5.9, అనంతగిరిలో 5.9, విశాఖపట్నంలో 5.8, ఎస్.కోటలో 5.7, కోయిలకుంట్లలో 5.2, డెంకాడ, సోంపేటలలో 5, కొరిశపాడులో 4.8, రామభద్రాపురం, మార్కాపురంలలో 4.7, నిడదవోలులో 4.6, గుండ్లకుంటలో 4.5 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షం
సాక్షి ప్రతినిధి, చెన్నై/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తిరుమల: బురేవి తుపాను వాయుగుండంగా బలహీన పడి మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతోంది. తమిళనాడులో భారీ వర్షాలతో 17 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. 9 మంది మరణించారు. బురేవి శనివారం మ.12 గంటలకు దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తిరుమలలో ఈ సంవత్సరం రికార్డుస్థాయిలో 1,750 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తిరుమలలో అన్ని డ్యామ్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. -
చెన్నైకు‘నివర్’ ముప్పు!
సాక్షి ప్రతినిధి, చెన్నై, సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తుపానుగా మారింది. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన ‘నివర్’ తుపాన్ తీరం వైపు వడివడిగా పయనిస్తోంది. రాబోయే 12 గంటల్లో పెను తుపానుగా మారి బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి చెన్నై సమీపంలోని మహాబలిపురం–కారైక్కాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ తీరందాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్ తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. నివర్ ప్రభావం ఎక్కువగా తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమపై ఉంటుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జి.లక్ష్మి తెలిపారు. నిండుకుండలా చెంబరబాక్కం తమిళనాడులో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంబరబాక్కంతోపాటు చెన్నై దాహార్తిని తీర్చే జలశయాలన్నీ ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చెంబరబాక్కంలోని ఉబరి నీటిని విడుదల చేస్తామని, భయం వద్దని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. తుపాన్ దృష్ట్యా బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని చెప్పారు. తుపాన్ సహాయ చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సీఎం ఎడపాడితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరో తుపాన్ గండం.. ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు.. తుపాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి పడవలు, వలలను భద్రపరుచుకుంటున్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికతో పాటు నాలుగో నం. సెక్షన్ సిగ్నల్ జారీ చేశారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమకు భారీ వర్ష సూచన నివర్ తుపాను ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 26వతేదీన కర్నూలు జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రైతన్నలూ... వరి ధాన్యం జాగ్రత్త తుపాన్ నేపథ్యంలో ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కమిషనర్ కన్నబాబు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు వెంటనే నూర్పిళ్లు చేపట్టి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవాలని రైతన్నలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశ వైపు కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించి ఈ నెల 25న తమిళనాడు–పుదుచ్ఛేరి తీర ప్రాంతానికి చేరనుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు శనివారం అనంతపురంలో రికార్డు స్థాయిలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 14.7, చింతపల్లిలో 15.2, అరకులో 18.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పలు జిల్లాల్లో ఎడతెరపిలేని వాన
సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు నిండుకోగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్‌లో 8 గేట్లను ఎత్తివేసి 85–క్యూసెక్కుల మేరకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికి 1,398 చెరువులు పూర్తిగా నిండి పొర్లుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇందుకూరుపేట మండలం గంగపట్నం–పల్లెపాళెం గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది. నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్ సోమవారం ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. సోమశిల ప్రాజెక్ట్‌కు సాయంత్రానికి 11 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరుతోంది. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి 1.5 కి.మీ. ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో తిరుపతిలో 15 సెం.మీ., గూడూరు, కావలిలో 9, పలమనేరులో 8, రాపూరు, కందుకూరు, ఉదయగిరి, సత్యవేడులో 7, శ్రీకాళహస్తిలో 6, నెల్లూరు, తొట్టంబేడు, అట్లూరు, వెంకటగిరి కోటలో 5, అవనిగడ్డ, ఆత్మకూరు, వెంకటగిరి, మచిలిపట్నం, బద్వేలు, కోడూరు, పెనగలూరులో 4 సెం.మీ. నమోదైంది. -
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : కొమరిన్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వరకు వ్యాపించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. -
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. దీపావళి తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో కావలిలో 7 సెం.మీ., సూళ్లూరుపేటలో 6, ఒంగోలు, తడ, వింజమూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో 4, వెంకటగిరి, చీమకుర్తి, సత్యవేడు, పుల్లంపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వదలని వాన గడచిన 24 గంటల్లో బొండపల్లి, కారంచేడులో 8 సెం.మీ., డెంకాడలో 7, గుడివాడ, కుక్కునూరులో 6, పాలకోడేరులో 5, చిత్తూరు, అనకాపల్లి, పోలవరం, రేపల్లె, నర్సీపట్నం, గజపతినగరంలో 5, పాలసముద్రం, పుంగనూరు, నగరి, నూజివీడు, నెల్లిమర్ల, విజయనగరం, వరరామచంద్రాపురం, కూనవరం, తుని, రాజమండ్రి, పొదిలి, గుంటూరు, చింతపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
దడ పుట్టిస్తోన్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణం): అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో దడ పుట్టిస్తోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు పలు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా చాలా ప్రాంతాల్లో వరి పంట తుది దశలో ఉంది. ఈ సమయంలో ఏమాత్రం వర్షాలు పడినా పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రైతులు బిక్కుబిక్కు మంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 14.67 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతకు వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశలో ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఈనిక దశలో ఉంది. ఆగస్టులో వచ్చిన వర్షాలు, వరదలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వరి పంట దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన వర్షాలకు కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ల సీజన్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు బెంబేలెత్తుతున్నారు. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఇది ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంవల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కంగారు పడొద్దు ప్రస్తుత అల్పపీడనం వల్ల ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. ఇది ఏ దిశగా పయనిస్తుందో పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇది సొమాలియా వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడినా రైతులు కంగారు పడాల్సిన పని లేదు. కోతకు వచ్చిన వరి చేలల్లో నీరు పోయేందుకు వీలుగా పాయలు తీసి ఉంచాలి. కోతలు పూర్తయి పనలమీద ఉంటే కుప్పలు వేసుకోవాలి. ధాన్యం కల్లాల్లో ఉంటే టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలి. కోత కోయాలనుకునేవారు ఒకటి రెండురోజులు ఆగటం ఉత్తమం. – టి.గోపీకృష్ణ, శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
రానున్న 24 గంటలలో జల్లులు
సాక్షి, విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం బలహీనపడి అల్పపీడ నంగా మారి ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్ మధ్య కొనసాగుతోంది. దీనిప్రభావం మరింత క్షీణించనున్నట్టు వాతావరణ నిఫుణులు తెలిపారు. మరో రెండు రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందన్నారు. దీని ప్రభావం మరో రెండు రోజుల్లో కనిపించే అవకాశాలున్నట్టు తెలిపారు. గురువారం ఉదయానికి తెలంగాణలోని లక్సెట్టిపేటలో గరిష్టంగా 3 సెం.మీ., భద్రాచలం, డోర్నకల్, మహబూబాబాద్‌లో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది.