సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది.
అనంతరం అది అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment