Nivar Cyclone Effect To Chennai - Sakshi
Sakshi News home page

చెన్నైకు‘నివర్‌’ ముప్పు!

Published Wed, Nov 25 2020 2:52 AM | Last Updated on Wed, Nov 25 2020 12:47 PM

Nivar Cyclone Effect To Chennai - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై, సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తుపానుగా మారింది. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన ‘నివర్‌’ తుపాన్‌ తీరం వైపు వడివడిగా పయనిస్తోంది. రాబోయే 12 గంటల్లో పెను తుపానుగా మారి బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి చెన్నై సమీపంలోని మహాబలిపురం–కారైక్కాల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్‌ తీరందాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్‌ తుపాన్‌ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. నివర్‌ ప్రభావం ఎక్కువగా తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమపై ఉంటుందని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారి జి.లక్ష్మి తెలిపారు. 

నిండుకుండలా చెంబరబాక్కం
తమిళనాడులో తుపాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంబరబాక్కంతోపాటు చెన్నై దాహార్తిని తీర్చే జలశయాలన్నీ ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చెంబరబాక్కంలోని ఉబరి నీటిని విడుదల చేస్తామని, భయం వద్దని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. తుపాన్‌ దృష్ట్యా బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని చెప్పారు. తుపాన్‌ సహాయ చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సీఎం ఎడపాడితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

మరో తుపాన్‌ గండం..
ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు..
తుపాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 65 నుంచి 85  కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి పడవలు, వలలను భద్రపరుచుకుంటున్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికతో పాటు నాలుగో నం. సెక్షన్‌ సిగ్నల్‌ జారీ చేశారు.

నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమకు భారీ వర్ష సూచన
నివర్‌ తుపాను ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 26వతేదీన కర్నూలు జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

రైతన్నలూ... వరి ధాన్యం జాగ్రత్త
తుపాన్‌ నేపథ్యంలో ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు వెంటనే నూర్పిళ్లు చేపట్టి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవాలని రైతన్నలను కోరారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement