తుపాను తీవ్రతను సూచిస్తున్న ఉపగ్రహ ఛాయాచిత్రం
ప్రపంచ వాతావరణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆయా దేశాలు తమ ప్రాంతాలలో తుపానులకు పేరు పెట్టడం ఆనవాయితీ. తద్వారా తుపాను పట్ల అవగాహన పెంచి, నష్ట నియంత్రణకు మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు బంగ్లాదేశ్ ‘నిసర్గా’ అని, భారత్ ‘గతి’ అని సూచించగా, ఇరాన్ సూచించిన ‘నివర్’ పేరు ఖరారైంది. ‘ని’ అంటే కొత్త అని, ‘వర్’ అంటే దేశం లేదా స్థలం, ఇల్లు లేదా నివాస స్థలం అనే అర్థం వస్తుంది. మొత్తంగా ‘నివర్’ అంటే కొత్త ప్రదేశం అని అర్థం. ఈ పదాన్ని కుర్దిష్ నుంచి తీసుకున్నారు.
సాక్షి, అమరావతి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, చెన్నై, కడప/నెల్లూరు అర్బన్/తడ : నివర్ తుపాను బుధవారం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ కరైకల్ – తమిళనాడులోని మామల్ల్లపురం మధ్య పాండిచ్చేరికి సమీపంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాములోగా తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి ప్రకటించింది. నివర్ తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 145 కి.మీ. గరిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని పేర్కొంది. నివర్ ప్రభావం వల్ల గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఉత్తర కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాన్ సహాయక చర్యల కోసం ముందస్తుగా 179 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్‌ఎఫ్, 85 మంది సభ్యులతో 4 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. కాగా, దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
తమిళనాడులో చెరువులు, జలాశయాలు ఫుల్
► నివర్ ప్రభావంతో తమిళనాడు తీరంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో బుధవారం సాయంత్రం 6వ నంబర్ వరకు ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు.
► సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ప్రజలను కోరింది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, కోస్ట్‌గార్డ్, గజ ఈతగాళ్లు, అగి్నమాపక శకటాలు, రబ్బర్ బోట్లు, వృక్షాల తొలగింపునకు యంత్రాలు, వరద నీటిని తోడేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులను రద్దు చేశారు.
► ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పరిస్థితిని సమీక్షించారు. చెన్నై దాహార్తిని తీర్చే పూండి, పుళల్, చోళవరం జలాశయాల్లో సైతం నీటిమట్టం పెరుగుతోంది. చెంగల్పట్టు జిల్లాలో 235 చెరువులు పూర్తిగా నిండాయి.
బుధవారం భీకర తుపాను గాలుల ధాటికి చెన్నైలో కుప్పకూలిన భారీ వృక్షం
సముద్రంలో చిక్కుకున్న 29 మంది మత్స్యకారులు
► బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన 29 మంది మత్స్యకారులు శ్రీహరికోట పరిధిలోని తెత్తుపేట వద్ద బుధవారం సముద్రం, పులికాట్ సరస్సు మధ్య చిక్కుకున్నారు. తడ మండలం ఇరకంకుప్పానికి చెందిన 20 మంది, తమిళనాడు పరిధిలోని నొచ్చుకుప్పం, బాటకుప్పంకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు.
వైఎస్సార్ జిల్లాలో అప్రమత్తం
► తుపాను నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కడప కలెక్టరేట్‌తోపాటు రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
► మూడు ప్రత్యేక టీంలు, ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒక రెస్క్యూటీం ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరి కిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు
► నెల్లూరు జిల్లా అంతటా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. 12 తీర ప్రాంత మండలాలు, 8 పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ఏరియాల్లో 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
► ఇప్పటికే సుమారు 700 కుటుంబాలను తరలించి, ఆహార సదుపాయాలు కల్పించారు. 9 మండలాలకు ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు. కోట, వాకాడు, చిట్టమూరు తదితర మండలాల్లో ఇప్పటికే 90 నుంచి 110 మి.మీ. వరకు వర్షం కురిసింది.
► కోట, వాకాడు, నెల్లూరు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తమిళనాడుకు చెందిన 124 బోట్లు నెల్లూరు వైపు కొట్టుకుని రావడంతో కృష్ణపట్నం పోర్టు సిబ్బంది.. బోట్లతో పాటు మత్స్యకారులును కాపాడారు.
► తుపాను ప్రభావంపై జల వనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment