
సాక్షి ప్రతినిధి, చెన్నై/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తిరుమల: బురేవి తుపాను వాయుగుండంగా బలహీన పడి మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతోంది. తమిళనాడులో భారీ వర్షాలతో 17 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. 9 మంది మరణించారు. బురేవి శనివారం మ.12 గంటలకు దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తిరుమలలో ఈ సంవత్సరం రికార్డుస్థాయిలో 1,750 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తిరుమలలో అన్ని డ్యామ్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి.