
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురిది. గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నేడు, రేపు కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.