![Southwest Monsoon Started In Rayalaseema Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/rain.jpg.webp?itok=jA_Xd44i)
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలాయి. పది రోజుల క్రితమే అవి రాయలసీమను తాకినా బిపర్జోయ్ తుపాను ప్రభావంతో ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండిపోయాయి. తుపాను తీరం దాటడంతో ఆదివారం నుంచి అవి ముందుకు కదిలేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం దాదాపు రాయలసీమ అంతటికీ విస్తరించాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారానికి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరించి వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఉపరితల ఆవర్తనం ఇలాగే కొనసాగితే ఇంకా ముందుగానే రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు
రుతుపవనాల ప్రభావంతో కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలాచోట్ల వాతావరణం చల్లబడింది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలన్నీ చల్లబడగా కోస్తా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గాయి. కృష్ణా, గుంటూరు బెల్ట్‌లోనే సోమవారం ఎండ తీవ్రత కనిపించింది.
గత పది రోజులుగా 600కి పైగా కేంద్రాల్లో 40 నుంచి 46 డిగ్రీలు వరకు నమోదైన ఉష్ణోగ్రతలు సోమవారం 120 కేంద్రాల్లోనే నమోదయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన మేఘాలు బలంగా కదులుతుండడంతో మంగళవారానికల్లా రాష్ట్రం మొత్తం చల్లబడి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment