![Heavy Rains Forecast in South Coastal And Rayalaseema - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/5/Heavy-Rains-Forecast.jpg.webp?itok=fmXtYopU)
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడిన రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల రెండు లేదా మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయనీ, ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోనున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. వేపాడలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా, ఆనందపురంలో 8.8, కె.కోటపాడులో 7.2, సంతబొమ్మాళిలో 7.1, యర్రగొండపాలెంలో 6.3, మందసలో 5.9, అనంతగిరిలో 5.9, విశాఖపట్నంలో 5.8, ఎస్.కోటలో 5.7, కోయిలకుంట్లలో 5.2, డెంకాడ, సోంపేటలలో 5, కొరిశపాడులో 4.8, రామభద్రాపురం, మార్కాపురంలలో 4.7, నిడదవోలులో 4.6, గుండ్లకుంటలో 4.5 సెం.మీల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment