విజయనగరంలో ఏర్పాటైన వాల్మికి రీసెర్చ్ సెంటర్
ప్రపంచంలోనే తొలి రీసెర్చ్ సెంటర్ ఇదే
మానవత్వ విలువల్ని భావితరాలకు అందించడమే లక్ష్యం
విజయనగరం రూరల్: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మికి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మికి రామాయణ రీసెర్చ్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామనారాయణం ఒక ఆధ్యాతి్మక కేంద్రం మాత్రమే. వాల్మికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.
12 వేల గ్రంథాలు ఏర్పాటు
వాల్మికి రామాయణం రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాతి్మక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్‌డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
యువత రావాలి
ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కలి్పంచిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.వైష్ణవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి
పూర్వజన్మ సుకృతం
మా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేశంలో పలు మార్గాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువుల సలహాలు, ఆశీస్సులతో ఈ కేంద్రం ఏర్పాటుచేసి సమాజ శ్రేయస్సుకు మా వంతు కృషి చేస్తున్నాం – నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం
Comments
Please login to add a commentAdd a comment