వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో పూల ధరలు గురువారం చుక్కలనంటాయి. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నా నగరవాసులు ఏమాత్రం భయపడకుండా మార్కెట్‌కు పోటెత్తారు. దాంతో పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మీ వ్రతం కావడంతో ఇళ్లలో ప్రత్యేక పూజలు, ఇతర వ్రతాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ క్రమంలో గురువారం మార్కెట్‌కు వెళ్లిన నగర వాసులకు ఆయా ధరలు చూసి ఒక్కసారిగా మూర్చపోయినంత పనైయింది. ముఖ్యంగా నగరంలోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ పూల మార్కెట్‌లో కిలో కనకాంబరాలు రూ.1000 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు కేవలం రూ.500 మాత్రమే పలికింది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కనకాంబం ధర ఐదు రెట్లు పెరిగింది.
పూలధరలకు రెక్కలు
మల్లెపూలు మంగళవారం కిలో రూ.200 ఉండగా గురువారం రూ.600 పలికింది. అదేవిధంగా సన్నజాజులు కూడా రూ.200 నుంచి 600 లకు పెరిగింది. అలాగే చామంతి పూలు గురువారం రూ. 300 నుంచి 400 వరకు విక్రయించారు. బంతిపూలు రూ.150, గులాబీ కిలో రూ.300, లిల్లీ రూ.200, హైబ్రీడ్ గులాబీ రూ.100 నుంచి 200 చొప్పున పలికాయి. వాటితో పాటుగా బెంగళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట రూ.200 పలికింది. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం కొండెక్కి కూర్చున్నాయి.
కరోనాను సైతం లెక్కచేయని వైనం..
నగరంలో కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నా వాటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా మార్కెట్లకు తరలివస్తున్నారు. పూలమార్కెట్‌లో కనీసం అడుగు దూరం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ మరీ పూలు కొనుగోలు చేశారు. గత ఏడాది సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉందో అదేవిధంగా గురువారం కూడా పూలమార్కెట్ దర్శనమిచ్చింది.
పండ్ల ధరలు సైతం పైపైనే..
మార్కెట్‌లో పండ్ల ధరలకు సైతం ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు వాయినాలు ఇవ్వడం పరిపాటి. అందులో ఒకటీ, రెండు పండ్లు జతచేసి వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా వాటిని కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు వాటి ధరలు చూసి అవాక్కయ్యారు. బుధవారం సాధారణ అరటిపండ్లు డజను రూ.35కు విక్రయించగా వాటిని గురువారం రూ.60కు తక్కువ లేదంటూ వ్యాపారులు తెగేసి చెప్పి మరీ విక్రయాలు చేశారు. అలాగే ద్రాక్ష సాధారణ రోజుల్లో రూ.100 పలికితే గురువారం రూ.140లుగా వినిపించింది. అదేవిధంగా బత్తాయి, దానిమ్మ, జామ, యాపిల్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
కిటకిటలాడిన నగర మార్కెట్లు
నగరంలోని పండ్లు, పూలు, ఇతర పూజా సామగ్రి విక్రయించే మార్కెట్లు కిటకిటలాడాయి. కనీసం అడుగుతీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేకుండా వినియోగదారులు ఆయా మార్కెట్లకు పోటెత్తారు. ముఖ్యంగా వన్‌టౌన్‌లోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్‌లో లోపలకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి కనీసం పావుగంటకు పైగా సమయం పట్టిందంటే రద్దీ ఎంతగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, బీసెంట్‌రోడ్డు తదితరప్రాంతాల్లో సైతం పండ్ల, పూల మార్కెట్లకు నగరవాసులు పోటెత్తారు. మార్కెట్ల రద్దీ కారణంగా ఆయా ప్రాంతాల్లో పాదచారుల రాకపోకలకు ఇబ్బ ందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలు మార్లు ట్రాఫిక్ స్తంభించింది.
మళ్లీ కళకళ..
శ్రావణ శుక్రవారం, బక్రీద్ పర్వదినాల నేపథ్యంలో విజయవాడలో వస్త్ర, బంగారం దుకాణాలు కళకళలాడాయి. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా వెలవెలబోయిన దుకాణాలు కస్టమర్లతో నూతన శోభతో కనిపించాయి. కరోనా ముందు పరిస్థితులు మళ్లీ కళ్లముందు కదలాడాయి. ఏ దుకాణంలో చూసినా కొనుగోలు దారులు కనిపించారు. వ్యాపారులు సైతం ఆశ్చర్యానందానికి లోనయ్యారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరిపారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment