రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదంటే... ఆంధ్రప్రదేశ్ గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిపోయిందని బ్రాండ్ చెయ్యాలి. కొన్నాళ్లు ఇదే స్కీమ్‌ను అమలు చేశాయి టీడీపీ, ఎల్లో మీడియా!. కానీ దాదాపు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటూ దేశమంతా ఏపీకి క్యూ కట్టింది. ఎల్లో ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది.
ఇప్పుడు విశాఖ వంతు! సీఎం జగన్ సంకల్పిస్తున్నట్టుగా అక్కడకు రాజధాని రాకూడదు. అలా వస్తే తాము స్కెచ్ వేసిన రూ.లక్షల కోట్ల అమరావతి భూముల లూటీ సాధ్యం కాదు. అందుకే కొన్నాళ్లుగా విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే పనిలో పడ్డాయి. ప్రైవేటు ఒప్పందాలకు సైతం... ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లుగా మసి పూస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి.
‘రేడియంట్ భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం’ అంటూ టీడీపీ చేసిన ఆరోపణలను సోమవారం ‘ఈనాడు’ మొదటి పేజీల్లో అచ్చువేయటం కూడా ఇలాంటిదే. ఎందుకంటే ఆ భూములు రేడియంట్ కంపెనీకి కేటాయించింది టీడీపీ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపులిచ్చిందీ టీడీపీనే. ఆ భూముల కోసం వీఎంఆర్‌డీఏకు డబ్బులు చెల్లించింది కూడా వైసీపీ ప్రభుత్వం రాకముందే.
ఆ తర్వాత సదరు కంపెనీ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో తనకున్న సాన్నిహిత్యం కారణంగా వీపీఆర్ ప్రాజెక్ట్స్‌తో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందానికి ఇప్పుడు తెలుగుదేశం మసిపూస్తోంది. ‘ఈనాడు’ మారేడుకాయ చేస్తోంది. ఈ కూతలు, రాతలన్నీ విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను ఫణంగా పెట్టినవే!.
ఆ ఒప్పందం ప్రకారం హై ఎండ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో భూ యజమానికి 30%, డెవలపర్‌కు 70% వాటా ఉంటుంది. విల్లాలకు వచ్చేసరికి 40:60... మిగతా భూమిలో 50:50 వాటా ఉంటాయి. కానీ మనసులో దుర్మార్గం, దుర్బుద్ధి మాత్రమే నింపుకున్న టీడీపీ తైనాతీలు 70:30% వాటానే ప్రస్తావిస్తూ ఆరోపణలతో చెలరేగిపోయారు. ఇక్కడ ఆరోపణలు చేసిన వారికి గానీ, కుట్ర బుద్ధితో అచ్చేసిన రామోజీరావుకు గానీ ఒక్కటే ప్రశ్న.
మీ ఇంటి మనిషి జయభేరి మురళీమోహన్ హైదరాబాద్‌లో నిర్మించిన హై ఎండ్ అపార్ట్‌మెంట్ నిర్మాణాల్లో భూ యజమానికిచ్చిన వాటా ఎంత? 30 కన్నా తక్కువేకదా? అప్పుడెందుకు ఈ విమర్శలు చేయలేదు? విశాఖలో నిర్మాణంలో ఉన్న ఎంకే–1, స్కైవ్యూ వంటి హై ఎండ్ ప్రాజెక్టుల్లోనూ ఇదే స్థాయి వాటా కదా? అసలు ఇటీవలి కాలంలో హై ఎండ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టిన ఏ డెవలపరైనా భూ యజమానికి 40% వాటా ఇచ్చిన సందర్భాలున్నాయా? టీడీపీకో, రామోజీరావుకో ఇది తెలియక కాదు.
ఒక కుట్ర ప్రకారం సీఎం కుటుంబంపై బురదజల్లే ప్రయత్నమిది. విశాఖలో ఏదో జరిగిపోతోందన్న భయాలు రేకెత్తించే ప్రయత్నమిది. ఇంతటి నీచ రాజకీయాలు చేయటానికి ఎవరికైనా సిగ్గుండాలి కదా? ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టపడి ఒక ఒప్పందానికి వస్తే దాంతో ప్రభుత్వానికేం సంబంధం? తనను బలవంతంగా తక్కువ వాటాకు ఒప్పించారని సదరు భూ యజమాని మీకేమైనా చెప్పాడా? ఆరోపణలు చేసిన టీడీపీ వాళ్లకెలాగూ నిజాలతో పనిలేకపోవచ్చు. కానీ పేరున్న పత్రికాధిపతిగా మీకైనా ఉండాలి కదా? ఈ రాతలపై మండిపడ్డ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చెప్పిన వాస్తవాలివిగో...
నెల్లూరు (సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా... రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వానికి అంటగట్టి బురద జల్లేందుకు టీడీపీ, ఈనాడు, పచ్చ పత్రికలు ప్రయత్నిస్తున్నాయని వీపీఆర్ ప్రాజెక్ట్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈనాడు, ఎల్లో మీడియాలో రేడియంట్ డెవలపర్స్ భూమికి సంబంధించి రాసిన టీడీపీ అసత్య ఆరోపణలపై నిజానిజాలను వివరించారు. ‘రేడియంట్ సంస్థకు టీడీపీ హయాంలో జీవో నంబరు 77 పేరుతో 2019 ఫిబ్రవరి 14న 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూముల్ని కూడా కోర్టు తీర్పుతో అప్పట్లో సీఎం చంద్రబాబు హయాంలోనే అప్పగించారు.
సుప్రీంకోర్టులో కూడా కేసు గెలుచుకుని, ట్రిబ్యునల్‌లో కూడా అనుకూలంగా తీర్పు తెచ్చుకుని... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందే ఆ సంస్థ వీఎంఆర్‌డీఏకు నగదు చెల్లించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మా కంపెనీ వీపీఆర్‌కు రేడియంట్‌కు మధ్య 2021 ఫిబ్రవరి 23న డెవలప్‌మెంట్ ఒప్పందం కుదిరింది. రేడియంట్ సంస్థతో మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. రేడియెంట్ ఒక్కటే కాదు. చాలా సంస్థలతో మేం వ్యాపారం చేస్తున్నాం. మరి దీన్లో కుంభకోణం ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు.
అన్ని నగరాల్లోనూ అంతే కదా?
‘మేం ఒక సంస్థతో వ్యాపార ఒప్పందం చేసుకుంటే తప్పేంటి? సాధారణంగా హై ఎండ్ అపార్ట్‌మెంట్ల కోసం విశాఖ, హైదరాబాద్, బెంగళూరు వంటి ఏ నగరంలోనైనా 70–30 శాతం అగ్రిమెంట్లే జరుగుతున్నాయి. రామోజీరావు గానీ, చంద్రబాబు గానీ ఇలాంటి ప్రాజెక్టుల్లో భూ యజమానికి 50 శాతం వాటా ఇస్తారా చెప్పండి? నేను వందలు కాదు... వేల ఎకరాలు కొని మీకు డెవలప్‌మెంట్ కోసం ఇస్తా?’ అని సవాల్ విసిరారు.
ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని అడ్డుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదంతా భాగమేనని వేమిరెడ్డి ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీద ఈనాడుకు ప్రేమ ఉంటే మా బిజినెస్ వ్యవహారాలను కూడా వక్రీకరించి రాస్తారా? చివరికి దగదర్తి విమానాశ్రయం గురించి కూడా ఇలాగే రాశారు. దగదర్తిలో కంటే తెట్టు దగ్గర విమానాశ్రయం రావటం వల్ల నెల్లూరు జిల్లాకే కాకుండా ప్రకాశం జిల్లాకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. దీనిపై నీచపు రాతలు రాయడం దుర్మార్గం కాదా?’అని ప్రశ్నించారు.
వైఎస్ భారతికి ఏమి సంబంధం?
కనీస సంస్కారం లేకుండా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పేరును ఈ వ్యవహారంలోకి లాగడం సిగ్గు చేటు అని వేమిరెడ్డి విమర్శించారు. వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి పేరు కూడా వైఎస్ భారతి అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) నుంచి వివరాలు తీసుకున్నప్పుడు భారతి అని ఉంటే ఆమె ఎవరో కూడా తెలుసుకోవాలి. అందులో వయసు ఉంటుంది.
ఇవేవీ చూడకుండా సీఎం భార్యను టార్గెట్ చేసి రాయడానికి సిగ్గు, బుద్ధి ఉండాలి. కుటుంబ సభ్యులను కూడా బయటకు లాగుతున్న దుర్మార్గాన్ని జర్నలిజం అంటారా?’ అని వేమిరెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment