అనుమసముద్రంపేట: వింజమూరు మండలంలోని చంద్రపడియలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రేడియంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా ముగ్గురు విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో ఏఎస్‌పేట మండలానికి చెందిన ఇద్దరు కార్మికులు ఉన్నారు. మండలంలోని పెద్దబ్బీపురం గ్రామానికి రజనీకాంత్ చెన్నై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజనీకాత్ తండ్రి రమణయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం కాగా, తల్లి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన రజనీకాంత్ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చంద్రపడియలోని కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. రజనీకాంత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య నిండు గర్భిణి. దీంతో ఈ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
నిలకడగా..
ఇదే మండలం చిన్నబ్బీపురం గ్రామానికి చెందిన భాస్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిది పేద కుటుంబం. భాస్కర్ తండ్రి వృద్ధాప్యంతో మంచానికే పరిమితం కాగా, భార్య కూలి పనులు చేసుకుంటూ కుటుంంబానికి ఆదరువుగా ఉంది. భాస్కర్ ఇటీవలే ఫ్యాక్టరీలో పనికి చేరాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 30 శాతానికి పైగా శరీరం కాలింది.
Comments
Please login to add a commentAdd a comment