జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ దారుణ హత్య | Village Revenue Assistant killed in blast: Andhra pradesh | Sakshi
Sakshi News home page

జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చి వీఆర్‌ఏ దారుణ హత్య

Published Tue, Oct 1 2024 4:52 AM | Last Updated on Tue, Oct 1 2024 4:52 AM

Village Revenue Assistant killed in blast: Andhra pradesh

మృతుడి భార్యకు తీవ్ర గాయాలు 

వివాహేతర సంబంధమే కారణం  

వేముల : వైఎస్సార్‌ జిల్లా వి.కొత్తపల్లెలో వీఆర్‌ఏ యలంకూరి నరసింహులు(49)ను జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృతుడి భార్య సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు..  గ్రామంలో నరసింహులు వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తూ ముగ్గురాయి మైనింగ్‌లో కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నరసింహులు భార్య సుబ్బలక్ష్మితో అదే గ్రామానికి చెందిన బాబు సన్నిహితంగా ఉండేవాడు.

ఈ విషయంపై నరసింహులు, బాబు తరచూ గొడవపడేవారు.  ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్డులో చెరో మంచంలో నరసింహులు, భార్య సుబ్బలక్ష్మి పడుకున్నారు. నరసింహులుపై కక్ష పెంచుకున్న బాబు.. ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం రాత్రి జెలిటిన్‌ స్టిక్స్‌కు వైరు అమర్చి నరసింహులు ఇంటి ముందు ఉన్న పాడుబడ్డ ఇంట్లోంచి పేల్చి వేశాడు. పేలుడు ధాటికి నరసింహులు పైకి ఎగిరి రేకులకు తగిలి కిందపడ్డాడు.

పేలుడుకు సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. సుబ్బలక్ష్మిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఆర్‌కే వ్యాలీ సీఐ నాగరాజు, రూరల్‌ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, వేంపల్లె ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌లతో కలిసి ఆదివారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుడి కుమారుడు సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement