సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి విశాఖలో పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఆయన రైల్వేజోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం నవంబర్ 11న విశాఖకు ఆయన రానున్నారని అధికారిక వర్గాల సమాచారం.
ఈ పర్యటనలో రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా.. నవంబర్ 11న ఆయన విశాఖ చేరుకుని ప్రధానితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11న ప్రధానికి సీఎం స్వాగతం వచ్చేనెల 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా స్వాగతం పలుకుతారు.
అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు. కాసేపు ఈఎన్‌సీ అధికారులతో రక్షణ రంగంపై చర్చించి రాత్రి అక్కడే బసచేస్తారు. 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచే పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడతారు. అనంతరం మ.2 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని.. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయల్దేరుతారు. ఇక ప్రధాని మోదీ విశాఖలో ప్రారంభించే ప్రాజెక్టుల వివరాలివీ..
► దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.120 కోట్లతో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తారు. డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలోని వైర్‌లెస్ కాలనీలో ఈ హెడ్‌క్వార్టర్స్ నిర్మిస్తారు.
► విశాఖ శివారు వడ్లపూడిలో రైల్వే అనుబంధ సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ వర్క్‌షాప్‌ను జాతికి అంకితం చేస్తారు. ఇక్కడ నెలకు 200 వ్యాగన్లను పూర్తిస్థాయిలో ఓవర్ హాలింగ్ చేసేలా నిర్మించారు.
► రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) నేతృత్వంలో రూ.446 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని, సీఎం శంకుస్థాపన చేస్తారు.
► సుమారు రూ.26 వేల కోట్లతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుని కూడా వారిద్దరూ ప్రారంభిస్తారు.
► గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌నూ ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.380 కోట్లతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికీ వారు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు రైల్వే, ఇతర కేంద్ర సంస్థలకు సంబంధించిన పలు శంకుస్థాపనలను ప్రధాని చేస్తారు.
► ఆ తర్వాత ప్రధాని మోదీ, సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. కలెక్టర్ డా.మల్లికార్జున నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది.
చిరకాల స్వప్నం, నెరవేరే సమయం.. 12న విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన
Published Fri, Oct 28 2022 2:04 AM | Last Updated on Fri, Oct 28 2022 3:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment