సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధాని విశాఖ నుంచే త్వరలో పాలన సాగిస్తామని ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సులో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులోనూ ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించినట్లు తెలిసింది.
జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక అధికారులు నిష్క్రమించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకుని నిబంధనల మేరకు తమకు నిర్దేశించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జాగ్రత్తలు సూచించారు.
రాష్ట్రంలో గత 45 నెలలుగా జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చాటిచెప్పాలని మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ అరాచకాలను ఎండగట్టడంతోపాటు ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందచేస్తున్న తీరును ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment