విశాఖపట్నంలోని కింగ్‌జార్జి (కేజీహెచ్) ఆస్పత్రి రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసవాలు చేస్తున్న ఆస్పత్రిగా ఘనత సాధించింది. 2020–21లో ఇక్కడ సగటున రోజుకు 33.70 ప్రసవాలు చేశారు. 33.56 ప్రసవాలతో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి రెండోస్థానంలో నిలిచింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా సుమారు 3 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతుండగా, అందులో లక్ష ప్రసవాలు బోధనాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. మిగతా రెండు లక్షల ప్రసవాలు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులతో పాటు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్నాయి. బోధనాసుపత్రుల్లో అత్యల్పంగా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 1.72 ప్రసవాలు మాత్రమే జరుగుతున్నట్లు తాజా గణాంకాల్లో తేలింది.
పీహెచ్‌సీల్లో కోసిగి టాప్..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా కోసిగి పీహెచ్‌సీ ఆదర్శంగా నిలిచింది. ఏడాదిలో ఇక్కడ 1,578 ప్రసవాలు నిర్వహించారు. అత్యధిక ప్రసవాలు చేస్తున్న 10 పీహెచ్‌సీలలో ఆరు పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలోనే ఉండటం గమనార్హం. కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సగటున రోజుకు 4.32 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆదోని పరిధిలోని పెద్దతుంబళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏడాదికి 1,302 ప్రసవాలు చేస్తోంది. అంటే రోజుకు 3.57 ప్రసవాలు జరుగుతున్నాయి. అలాగే, పెద్దకడుబూరు, బేతంచెర్ల, కౌతాళం వంటి ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్‌సీలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి వంద అంతకంటే ఎక్కువ ప్రసవాలు 96 పీహెచ్‌సీల్లో జరుగుతున్నాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో 2.83 లక్షల ప్రసవాలు..
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2020–21లో 2.83 లక్షల ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. అందులో సింహభాగం బోధనాసుపత్రుల్లో జరగ్గా, ఆ తర్వాత స్థానం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీల్లో 200 పైచిలుకు పీహెచ్‌సీల్లో మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇకపై అన్ని పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరపాలని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులు, స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.
ఎక్కడ ఎన్ని ప్రసవాలు
కేటగిరీ | ప్రసవాలు |
బోధనాసుపత్రులు | 88,684 |
జిల్లా ఆస్పత్రులు | 42,061 |
ఏరియా ఆస్పత్రులు | 38,883 |
సీహెచ్‌సీలు | 73,258 |
పీహెచ్‌సీలు | 40,877 |
బోధనాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా
ఆస్పత్రి |
ఏడాదిలో ప్రసవాలు | రోజుకు సగటున |
కింగ్‌జార్జి విశాఖ | 12,301 | 33.70 |
మెటర్నిటీ, తిరుపతి | 12,249 | 33.56 |
జీజీహెచ్, కాకినాడ | 9,375 | 25.68 |
జీజీహెచ్, విజయవాడ | 9,279 | 25.47 |
జీజీహెచ్, గుంటూరు | 8,771 | 24.03 |
జీజీహెచ్, అనంతపురం | 8,093 | 22.17 |
జీజీహెచ్, కర్నూలు | 7,928 | 21.72 |
జీజీహెచ్, కడప | 7,290 | 19.97 |
జీజీహెచ్, నెల్లూరు | 5,210 | 14.27 |
జీజీహెచ్, శ్రీకాకుళం | 3,329 | 9.12 |
జీజీహెచ్, ఒంగోలు | 628 | 1.72 |
Comments
Please login to add a commentAdd a comment