బొమ్మనహాళ్: ఈ కాలంలో చుక్కేసుకోవడానికి కారణం కావాలా? ఉద్యోగం వచ్చిందని... ప్రమోషన్ వచ్చిందని... పెళ్లాం ఊరెళ్లిందని.. బాబు పుట్టాడని... ఇంకేదీ దొరక్కపోతే.. బుర్ర చెడిందని.. పేరుకే సందర్భం! పెగ్గు వేసుకునేందుకు సాకులు ఎన్నో. ఇక మందు కొట్టేందుకు కూర్చోవడం వరకే వారి పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత కిక్కుతలకెక్కెంత వరకూ మందు కడుపులోకి దిగాల్సిందే.
మత్తు నోట్లో తలపెట్టి.. బయటికి రాలేక గిజగిజలాడుతూ ఎన్నో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పెళ్లాం మెడలో పుస్తెలు తెంపుకుని తాగినోళ్లు.. పిల్లలను అమ్ముకున్న దౌర్భాగ్యులు.. ఆస్తులు, భూములు అమ్ముకుని రోడ్డున పడ్డ దీనులు.. ఇలా ప్రతి తాగుబోతు వెనుక కథా కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే మత్తు సంకెళ్లను తెంచి.. కొత్త జీవితాన్ని ప్రసాదించే మార్గమూ ఒకటుందని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వాసులు అంటున్నారు. ఆ మార్గమేమిటో తెలుసుకోవాలంటే ఉంతకల్లును సందర్శించాల్సిందే.
ఆంధ్ర పండరీపురంగా..
ఉంతకల్లులో వెలసిన రుక్మిణీపాండురంగస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితంగా ఖ్యాతి గడించింది. ఆంధ్ర పండరీపురంగా ఈ గ్రామాన్ని భక్తులు పిలుస్తుంటారు. మహారాష్ట్రలోని పండరీపురాన్ని తలపించేలా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. గ్రామంలోని అందరూ పాండురంగ విఠలుడి భక్తులు కావడం మరో విశేషం. శతాబ్దాల క్రితం ఆ గ్రామానికి చెందిన కొందరు తీర్థయాత్రలకు వెళుతూ పండరీపురాన్ని దర్శించుకున్నారు. అక్కడి పాండురంగడి ఆలయం వారిని విశేషంగా ఆకట్టుకుంది. మనసారా ఆ దేవుడిని కొలిస్తే కోర్కెలు తీరుతాయని భావించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అచంచల భక్తిభావంతో గ్రామంలో పాండురంగడి ఆలయాన్ని నిర్మించి, ఇలవేల్పుగా కొలవడం మొదలు పెట్టారు.
చెడుని దూరం చేసే భగవంతుడిగా..
వ్యక్తిలోని చెడు గుణాలను దూరం చేసే దేవదేవుడిగా పాండురంగడిని భక్తులు కొలుస్తుంటారు. ఈ నమ్మకాన్ని రుజువు చేస్తూ.. మద్యానికి బానిసైన వారు ఉంతకల్లులోని రుక్మిణీపాండురంగ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మాల ధరిస్తే మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదు. స్వామి మీద అచంచల విశ్వాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేవలం మద్యం అలవాటు మాన్పించడం ఒక్కటే కాదు... వ్యక్తిలోని దుర్గుణాలను పాండురంగడు దూరం చేస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. దీంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేణ పెరుగుతూ వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు.
26న రథోత్సవం..
జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంతకల్లులో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రథోత్సవానికి పండరీపుర పీఠాధిపతి గోపాల్‌రాజ్ మహారాజ్ హాజరు కానున్నట్లు తెలిపారు.
ప్రతి ఏకాదశి ప్రత్యేకమే..
ప్రతి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. ఆ రోజున స్వామి మాల ధరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామిని నిష్టగా కొలిచి మాల ధరించిన వారు ఎందరో తిరిగి మద్యం జోలికి వెళ్లలేదు. వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి.
– రామాంజినేయులు, ఆలయ ప్రధాన అర్చకులు
(చదవండి: పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....)
Comments
Please login to add a commentAdd a comment