pandaripur temple
-
అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!
బొమ్మనహాళ్: ఈ కాలంలో చుక్కేసుకోవడానికి కారణం కావాలా? ఉద్యోగం వచ్చిందని... ప్రమోషన్ వచ్చిందని... పెళ్లాం ఊరెళ్లిందని.. బాబు పుట్టాడని... ఇంకేదీ దొరక్కపోతే.. బుర్ర చెడిందని.. పేరుకే సందర్భం! పెగ్గు వేసుకునేందుకు సాకులు ఎన్నో. ఇక మందు కొట్టేందుకు కూర్చోవడం వరకే వారి పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత కిక్కుతలకెక్కెంత వరకూ మందు కడుపులోకి దిగాల్సిందే. మత్తు నోట్లో తలపెట్టి.. బయటికి రాలేక గిజగిజలాడుతూ ఎన్నో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పెళ్లాం మెడలో పుస్తెలు తెంపుకుని తాగినోళ్లు.. పిల్లలను అమ్ముకున్న దౌర్భాగ్యులు.. ఆస్తులు, భూములు అమ్ముకుని రోడ్డున పడ్డ దీనులు.. ఇలా ప్రతి తాగుబోతు వెనుక కథా కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే మత్తు సంకెళ్లను తెంచి.. కొత్త జీవితాన్ని ప్రసాదించే మార్గమూ ఒకటుందని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వాసులు అంటున్నారు. ఆ మార్గమేమిటో తెలుసుకోవాలంటే ఉంతకల్లును సందర్శించాల్సిందే. ఆంధ్ర పండరీపురంగా.. ఉంతకల్లులో వెలసిన రుక్మిణీపాండురంగస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితంగా ఖ్యాతి గడించింది. ఆంధ్ర పండరీపురంగా ఈ గ్రామాన్ని భక్తులు పిలుస్తుంటారు. మహారాష్ట్రలోని పండరీపురాన్ని తలపించేలా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. గ్రామంలోని అందరూ పాండురంగ విఠలుడి భక్తులు కావడం మరో విశేషం. శతాబ్దాల క్రితం ఆ గ్రామానికి చెందిన కొందరు తీర్థయాత్రలకు వెళుతూ పండరీపురాన్ని దర్శించుకున్నారు. అక్కడి పాండురంగడి ఆలయం వారిని విశేషంగా ఆకట్టుకుంది. మనసారా ఆ దేవుడిని కొలిస్తే కోర్కెలు తీరుతాయని భావించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అచంచల భక్తిభావంతో గ్రామంలో పాండురంగడి ఆలయాన్ని నిర్మించి, ఇలవేల్పుగా కొలవడం మొదలు పెట్టారు. చెడుని దూరం చేసే భగవంతుడిగా.. వ్యక్తిలోని చెడు గుణాలను దూరం చేసే దేవదేవుడిగా పాండురంగడిని భక్తులు కొలుస్తుంటారు. ఈ నమ్మకాన్ని రుజువు చేస్తూ.. మద్యానికి బానిసైన వారు ఉంతకల్లులోని రుక్మిణీపాండురంగ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మాల ధరిస్తే మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదు. స్వామి మీద అచంచల విశ్వాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేవలం మద్యం అలవాటు మాన్పించడం ఒక్కటే కాదు... వ్యక్తిలోని దుర్గుణాలను పాండురంగడు దూరం చేస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. దీంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేణ పెరుగుతూ వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. 26న రథోత్సవం.. జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంతకల్లులో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రథోత్సవానికి పండరీపుర పీఠాధిపతి గోపాల్రాజ్ మహారాజ్ హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి ఏకాదశి ప్రత్యేకమే.. ప్రతి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. ఆ రోజున స్వామి మాల ధరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామిని నిష్టగా కొలిచి మాల ధరించిన వారు ఎందరో తిరిగి మద్యం జోలికి వెళ్లలేదు. వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. – రామాంజినేయులు, ఆలయ ప్రధాన అర్చకులు (చదవండి: పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....) -
7 వేల మామిడి పండ్లతో విఠల్-రుక్మిణి ఆలయ అలంకరణ
ముంబై: మహారాష్ట్రలోని పండర్పూర్లోగల విఠల్-రుక్మిణి ఆలయంలో శనివారం అక్షయ తృతీయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుమారు ఏడు వేల మామిడిపండ్లతో అందంగా అలంకరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయంలో అక్షయ తృతీయ వేడుకల ఏర్పాట్లు చేశారు. పుణేకు చెందిన వినాయక్ కచ్చి అనే వ్యాపారవేత్త ఈ మామిడి పండ్లను ఆలయానికి అందించారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో లభించే అల్ఫోన్సో రకపు మామిడి పండ్లను ఆలయ అలంకరణ కోసం వినియోగించారు. అనంతరం ఈ మామిడి పండ్లను కరోనా బాధితులకు పంపిణీ చేశారు. మామిడి పండ్లతో అలంకరించిన ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్ కన్నుమూత) -
విఠలుడికి భారీ ఆదాయం
సాక్షి, ముంబై: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పండరిపూర్ ఆలయంలో ఈసారి నిర్వహించిన ఆశాఢ ఏకాదశి ఉత్సవాలకు భారీగా ఆదాయం వచ్చింది. ఆలయంపై పూజారుల ఆధిపత్యాన్ని తగ్గించడంతో రూ.20 లక్షలను ఆర్జించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం దాదాపు మూడురెట్లు పెరిగిందని ఆలయ యాజమాన్యం ప్రకటించింది. గత సంవత్సరం ఆశాఢ ఏకాదశి ఉత్సవాలకు రూ.6,51,200 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.20,27,358 వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం విఠలుని ఆలయంలో గుత్తాధిపత్యాన్ని హైకోర్టు రద్దు చేయడమే. భక్తులు హుండీలో సమర్పించుకున్న లేదా విగ్రహం వద్ద మెక్కుబడులు చెల్లించుకున్నా గత ఏడాది వరకు అందులో అత్యధిక శాతం నగదు ఆలయ పూజారులే చేజిక్కించుకునే వారు. కోర్టు తీర్పుతో వీరి గుత్తాధిపత్యం రద్దయింది. భక్తులు సమర్పించుకున్న కానుకలన్నీ ఆలయ యాజమాన్యం ఖజానాలోకి వెళ్లిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆదాయం మూడురెట్లు పెరిగింది. ఆశాఢ ఏకాదశి ఉత్సవాలు ప్రతీ ఏడాది పండరిపూర్లో ఘనంగా జరుగుతాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కొందరు భక్తులు కాలికడకన, మరికొందరు పల్లకీలతో పక్షం రోజుల ముందే స్వగ్రామాల నుంచి బయలుదేరుతారు. ఏకాదశి రోజున పండరిపూర్కు చేరుకుంటారు. ఇలా ఏటా లక్షలాది జనం పండరిపూర్లోని చంద్రభాగ నదిలో స్నానాలుచేసి విఠల, రుక్మిణి విగ్రహాలను దర్శించుకుని తిరిగుముఖం పడతారు. గత సంవత్సరం వరకు ఈ ఆలయంలో పూజారులు గుత్తాధిపత్యం చెలాయించేవారు. పౌరోహిత్యం, పూజల నిర్వహణకు కూడా వారి వారసులనే నియమించుకునేవారు. ఫలితంగా ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యంగా మారడం, పురోహితుల ఆగడాలు శృతిమించుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. వీరి గుత్తాధిపత్యాన్ని తొలగించాలని కోరుతూ పండరిపూర్ వాసులు, ఆలయ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఆలయంపై పూజాలకు ఎలాంటి అధికారాలూ ఉండబోవని కోర్టు తీర్పు చెప్పింది. న్యాయస్థానం సంచలనాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గత ఏడాది పండరిపూర్లో సంబరాలు కూడా జరుపుకున్నారు. గుత్తాధిపత్యం రద్దయిన తరువాత ఆశాఢ ఏకాదశి ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. దీంతో ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖజానాలో జమ చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల తొమ్మిదిన నిర్వహించిన ఆశాఢ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా పాండురంగ ఆలయ పరిసరాలు విఠల విఠల నామస్మరణతో మార్మోగింది. ఈ ఆలయం ముందున్న చంద్రబాగ నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీల వెంబడి కాలినడక,వాహనాల ద్వారా ఇక్కడికి భక్తులు చేరుకొని నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ తిరునాళ్లలో పాల్గొనేందుకు రాష్ర్ట నలు మూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈసారి వర్షభావ పరిస్థితులు ఎదురవడంతో వీరి సంఖ్య కాస్త తగ్గింది. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల వరకు తరలి వచ్చే భక్తులు ఈసారి ఎనిమిది లక్షల మంది వరకు వచ్చారు.