విఠలుడికి భారీ ఆదాయం | pandharpur temple got huge income | Sakshi
Sakshi News home page

విఠలుడికి భారీ ఆదాయం

Published Mon, Jul 14 2014 11:44 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

విఠలుడికి భారీ ఆదాయం - Sakshi

విఠలుడికి భారీ ఆదాయం

సాక్షి, ముంబై: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పండరిపూర్ ఆలయంలో ఈసారి నిర్వహించిన ఆశాఢ ఏకాదశి ఉత్సవాలకు భారీగా ఆదాయం వచ్చింది. ఆలయంపై పూజారుల ఆధిపత్యాన్ని తగ్గించడంతో రూ.20 లక్షలను ఆర్జించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం దాదాపు మూడురెట్లు పెరిగిందని ఆలయ యాజమాన్యం ప్రకటించింది.

గత సంవత్సరం ఆశాఢ ఏకాదశి ఉత్సవాలకు రూ.6,51,200 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.20,27,358 వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం విఠలుని ఆలయంలో గుత్తాధిపత్యాన్ని హైకోర్టు రద్దు చేయడమే. భక్తులు హుండీలో సమర్పించుకున్న లేదా విగ్రహం వద్ద మెక్కుబడులు చెల్లించుకున్నా గత ఏడాది వరకు అందులో అత్యధిక శాతం నగదు ఆలయ పూజారులే చేజిక్కించుకునే వారు.
 
కోర్టు తీర్పుతో వీరి గుత్తాధిపత్యం రద్దయింది. భక్తులు సమర్పించుకున్న కానుకలన్నీ ఆలయ యాజమాన్యం ఖజానాలోకి వెళ్లిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆదాయం మూడురెట్లు పెరిగింది. ఆశాఢ ఏకాదశి ఉత్సవాలు ప్రతీ ఏడాది పండరిపూర్‌లో ఘనంగా జరుగుతాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కొందరు భక్తులు కాలికడకన, మరికొందరు పల్లకీలతో పక్షం రోజుల ముందే స్వగ్రామాల నుంచి బయలుదేరుతారు. ఏకాదశి రోజున పండరిపూర్‌కు చేరుకుంటారు.

ఇలా ఏటా లక్షలాది జనం పండరిపూర్‌లోని చంద్రభాగ నదిలో స్నానాలుచేసి విఠల, రుక్మిణి విగ్రహాలను దర్శించుకుని తిరిగుముఖం పడతారు. గత సంవత్సరం వరకు ఈ ఆలయంలో పూజారులు గుత్తాధిపత్యం చెలాయించేవారు. పౌరోహిత్యం, పూజల నిర్వహణకు కూడా వారి వారసులనే నియమించుకునేవారు. ఫలితంగా ఆలయ నిర్వహణ ఇష్టారాజ్యంగా మారడం, పురోహితుల ఆగడాలు శృతిమించుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.
 
వీరి గుత్తాధిపత్యాన్ని తొలగించాలని కోరుతూ పండరిపూర్ వాసులు, ఆలయ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఆలయంపై పూజాలకు ఎలాంటి అధికారాలూ ఉండబోవని కోర్టు తీర్పు చెప్పింది. న్యాయస్థానం సంచలనాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గత ఏడాది పండరిపూర్‌లో సంబరాలు కూడా జరుపుకున్నారు. గుత్తాధిపత్యం రద్దయిన తరువాత ఆశాఢ ఏకాదశి ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. దీంతో ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖజానాలో జమ చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల తొమ్మిదిన  నిర్వహించిన ఆశాఢ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా పాండురంగ ఆలయ పరిసరాలు విఠల విఠల నామస్మరణతో మార్మోగింది.
 
ఈ ఆలయం ముందున్న చంద్రబాగ నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీల వెంబడి కాలినడక,వాహనాల ద్వారా ఇక్కడికి భక్తులు చేరుకొని నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ తిరునాళ్లలో పాల్గొనేందుకు రాష్ర్ట నలు మూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈసారి వర్షభావ పరిస్థితులు ఎదురవడంతో వీరి సంఖ్య కాస్త తగ్గింది. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల వరకు తరలి వచ్చే భక్తులు ఈసారి ఎనిమిది లక్షల మంది వరకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement