డిజిటల్‌ మార్కెటింగ్‌ కేరాఫ్‌ వైజాగ్‌ | Vizag Is Care Of Address For Digital Marketing: Pulsus Group CEO | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ మార్కెటింగ్‌ కేరాఫ్‌ వైజాగ్‌

Published Wed, Aug 26 2020 1:28 PM | Last Updated on Wed, Aug 26 2020 1:28 PM

Vizag Is Care Of Address For Digital Marketing: Pulsus Group CEO - Sakshi

పల్సస్‌ సీఈవో  డా.గేదెల శ్రీనుబాబు

సాక్షి, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌కు విశాఖపట్నం కేంద్ర బిందువు కానుందని పల్సస్‌ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు అన్నారు. పల్సస్‌ కార్యాలయంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మార్కెటింగ్‌ అంటే ప్రజలు షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లి చేసేవారనీ.. ట్రెండ్‌ మారుతున్న తరుణంలో ఎక్కువ మంది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించనుందన్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ ద్వారా సుమారు 50 దేశాల వరకూ విశాఖపట్నం నుంచే సేవలు అందించే రోజులు సమీపంలో ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఐటీ, ఐటీఎస్‌ అవకాశాలను హైదరాబాద్, బెంగళూరు నగరాలు సొంతం చేసుకున్నాయనీ.. మిగిలిన డిజిటల్‌ మార్కెటింగ్‌ అవకాశాలు విశాఖవేనని అన్నారు. సంప్రదాయ మార్కెటింగ్‌ స్థానంలో దూసుకొస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ రోజు రోజుకీ ఎదుగుతున్నా.. సమర్థ మానవ వనరుల కొరత మాత్రం ఉందన్నారు. ఆసక్తి, అభిరుచి ఉన్నవారు తగిన నైపుణ్యాల్ని పెంపొందించుకుంటే బోలెడు అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చని సూచించారు. డేటా అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, విజువలైజేషన్‌ కన్సల్టెంట్స్, ఆపరేషన్‌ అనలిస్ట్, సప్‌లై చైన్‌ అనలిస్ట్, రీసెర్చ్‌ అనలిస్ట్, రిస్క్‌ అనలిస్ట్, డేటా మోడలర్‌తో పాటు విభిన్న రకాల ఉద్యోగాలు ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా రాబోతున్నాయని తెలిపారు. పల్సస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విశాఖలో కేవలం 20 మందితో కార్యకలాపాలు ప్రారంభించిందనీ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండంటంతో సేవలు విస్తరించి... ఇప్పుడు 940 మంది ఉద్యోగులతో కిటకిటలాడుతోందని వివరించారు.

నగరం నడిబొడ్డున ఉన్న విప్రో ఎస్‌ఈజెడ్‌ క్యాంపస్‌... పల్సస్‌ సెంటర్‌గా మారిపోయిందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలోనే మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో ఈ రంగం క్రమంగా పురోగమిస్తోందన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.100 కోట్ల వరకూ ప్రోత్సాహకాలు విడుదల చెయ్యడంతో చాలా కంపెనీలు ఊపిరి పోసుకున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా సంస్థను విస్తరించనున్నామని తెలిపారు. ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌లో విశాఖ నగరం ప్రపంచ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని శ్రీనుబాబు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement