ఆ ‘మూడేళ్ల’ సర్క్యులర్‌ను రద్దుచేయాలి
తమకు ఉద్యోగ భద్రత కల్పించి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి
వేతన బకాయిలు చెల్లించి రాజకీయ వేధింపులు ఆపాలి
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద వీఓఏల ధర్నాలు
సాక్షి నెట్‌వర్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు.
ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దుచేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్‌ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది.
ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖç³ట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు.
కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల రాష్ట్ర సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది.
Comments
Please login to add a commentAdd a comment