
మణికంఠ సోదరి పార్వతికి ఆర్థిక సాయం అందిస్తున్న సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు (ఫైల్)
సాక్షి, అనంతపురం: ఆపదలో ఉన్న క్రీడాకారులకు నేనున్నానంటూ సాయమందిస్తున్నారు వాలీబాల్ క్రీడాకారులు. ఇందుకోసం ప్రత్యేకంగా అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్ ద్వారా ఆపదలో ఉన్న వారిని గుర్తించి, వారికి తమకు తోచిన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
సేవ చేయడమే లక్ష్యంగా..
అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో వివిధ రంగాల్లో స్థిరపడిన చిన్ననాటి స్నేహితులు, పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యలో క్లాస్‌మేట్స్‌గా ఉన్న వారు సభ్యులుగా ఉన్నారు. తమ క్రీడాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర సమాచారాన్ని చేరవేస్తూ తమ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీరి దృష్టి సేవ వైపు మళ్లింది. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేలా బృహత్ కార్యాచరణను రూపొందించుకుని, ఆ దిశగా సభ్యులు అడుగులేస్తున్నారు.
రూ.లక్షల్లోనే సాయం
► పామిడికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు ముజాహిద్దీన్.. అదే పట్టణం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్సలకు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని రూ. లక్ష సాయం అందించారు. అలాగే అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేలా యాజమాన్యంతో చర్చించి ఓ సీనియర్ క్రీడాకారుడు ఒప్పించారు.
► అంబులెన్స్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న వాలీబాల్ క్రీడాకారుడు మణికంఠ... గతేడాది గుత్తి సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటీపీ సిటీ వాలీబాల్ గ్రూప్, ఏపీ వాలీబాల్ మెన్స్ గ్రూప్ సభ్యులు రూ. 1.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారు.
► పొట్టకూటి కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అనంతపురానికి వచ్చి తోపుడు బండ్లపై ఉసిరి, జామ వంటి సీజనల్ పండ్ల విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేతికందిన కొడుకు (వాలీబాల్ క్రీడాకారుడు) మరణిస్తే, ఆ కుటుంబానికి అన్నీ తామై తోడునీడుగా నిలిచారు.
► ఈ నెల 1వ తేదీ కూడేరు సమీపంలో ఆటో బోల్తాపడి గార్లదిన్నె మండలం తరిమెల గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు లక్ష్మీపతితో పాటు కుటుంబసభ్యులూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులు తక్షణమే స్పందించారు. లక్ష్మీపతి చికిత్సల కోసం అవసరమైన రూ. 2 లక్షలు సర్దుబాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయం కింద రూ. 60 వేలు అందజేశారు.
తక్షణం స్పందిస్తూ....
వాలీబాల్ క్రీడాకారుల గ్రూప్‌లో జూనియర్లు, సీనియర్లు అనే భేదభావం లేదు. వాలీబాల్ క్రీడ గురించి తెలిసిన ఉత్సాహవంతులైన ప్రతి క్రీడాకారుడిని ఈ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకుంటుంటారు. సభ్యుల్లో ఉన్న వారికే కాకుండా వారి కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ప్రమాదం వాటిల్లినా.. విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సభ్యులు తక్షణమే స్పందిస్తుంటారు. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటికే ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులకు ఆపన్న హస్తమందించారు. వీరిలో ఇద్దరు ప్రమాదం బారిన పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఆర్థిక చేయూతనందించారు. ప్రమాదాల్లో మృతి చెందిన సీనియర్ క్రీడాకారుల కుటుంబాలకు అన్నీ తామై తోడునీడుగా ఉంటూ వస్తున్నారు.
గొప్ప చెప్పుకోవాలని కాదు
అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉంటున్న నేను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించా. కుటుంబ పోషణ కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. క్రీడాకారులంటే చాలా గౌరమిస్తా. ఎవరైనా క్రీడాకారుడికి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే నా అంబులెన్స్‌లోనే బెంగళూరుకు తీసుకెళుతుంటా. లక్ష్మీపతి విషయంలోనే ఇదే జరిగింది. ఆ సమయంలో వారి కుటుంబసభ్యులు పడ్డ వేదన మాటల్లో చెప్పలేను. వారికి మేమున్నామంటూ మా వాలీబాల్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ధైర్యం చెప్పారు. ఇదంతా మేమేదో గొప్పలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కాదు. ఆపదలో ఉన్న క్రీడాకారులను మా వంతు సాయంగా ఆదుకుంటున్నామనే తృప్తి మాకు ఎంతో సంతృప్తినిస్తోంది.
– ప్రభు, వాలీబాల్ క్రీడాకారుడు, అనంతపురం
కరుణించే హృదయాలు స్పందిస్తున్నాయి
మా తోటి క్రీడాకారుడు అపాయంలో ఉన్నాడనే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో మిగిలిన సభ్యులకు తెలియపరుస్తుంటాం. ఆ సమయంలో చాలా మంది స్పందించి తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ సేవా కార్యక్రమం భవిష్యత్తులోనూ కొనసాగించేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. క్రీడల ద్వారా మాకంటూ ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాం. ఈ ఆటల ద్వారానే మాకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో క్రీడాభివృద్ధికే కాక, క్రీడాకారుల వ్యక్తిగత సమస్యలనూ పరిష్కరించే వేదికగా మా వాట్సాప్ గ్రూప్‌ను తీర్చిదిద్దాం.
– దినేష్, సీనియర్ క్రీడాకారుడు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment