సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా సత్కరిస్తోంది. కనీసం ఏడాది పాటు నిరాటంకంగా పనిచేస్తున్న వలంటీర్లందరినీ సత్కరించి, మూడు కేటగిరిల్లో నగదు బహుమతులను కూడా అందజేయనుంది.
ఈ వలంటీర్లకు వందనం నాలుగో విడత కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ ప్రాంత వలంటీర్లను సత్కరించే కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క ప్రతిపక్షాలు నిత్యం బెదిరింపు ధోరణులతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. కొన్ని పత్రికలు పనిగట్టుకుని నిరంతరం తమపై దు్రష్పచారం కొనసాగిస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 2.5 లక్షల మందికిౖ పెగా వలంటీర్లు తమ పనితీరుతోనే రాష్ట్ర ప్రజల మనన్నలతో పాటు దేశ ప్రజల ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే.
2,55,464 మందికి సత్కారం, నగదు బహుమతులు
వలంటీర్లకు వందనం పేరిట వరుసగా నాలుగో ఏడాది చేస్తున్న ఈ సత్కారానికి రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవావజ్ర, సేవారత్న అవార్డులతోను, నిరాటంకంగా ఏడాది పనిచేసిన వారికి సేవామిత్ర అవార్డుతోను సత్కరించి, నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు వంతున మొత్తం 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డు ప్రదానం చేయనున్నారు. ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ఐదుగురు వంతున, నగరపాలక సంస్థలో పదిమంది వంతున.. రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డు, కనీసం ఏడాది పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డు అందజేస్తారు.
997 మందికి ప్రత్యేక బహుమతులు
ఈ అవార్డులకు అదనంగా.. తమ పరిధిలో వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలతో మెరుగైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలపై ఉత్తమ వీడియోలు చిత్రీకరించిన వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులను కూడ ఈ ఏడాది కొత్తగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిల్లో ఒక్కొక్కటి వంతున 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి, వాటిని చిత్రీకరించిన వారికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. నియోజకవర్గస్థాయిలో ఒక్కొక్కటి వంతున 175 ఉత్తమ వీడియోలను ఎంపికచేసి, వాటిని చిత్రీకరించిన వారికి రూ.20 వేలు అందజేయనున్నారు. జిల్లాస్థాయిలో ఒకటి వంతున ఉత్తమ వీడియో ఎంపికచేసి వాటిని చిత్రీకరించిన 26 మందికి రూ.25 వేల చొప్పున ప్రత్యేక నగదు బహుమతి ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment