తానిగడప నిర్మలకుమారి , తుంగాన రమణమ్మ
పలాస/జంగారెడ్డిగూడెం: ఇప్పటికే వలంటీర్లు ఎంతో మంది సర్పంచ్‌లుగా ఎన్నికై ప్రజా సేవ చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు మరికొందరు వలంటీర్లు చేరారు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్లా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన ఆ గ్రామ వలంటీర్ తుంగాన రమణమ్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బంగారి జ్యోతిపై 1,199 ఓట్ల మెజారిటీ సాధించారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన రమణమ్మ ఇంటర్ వరకూ చదివారు. జీవనోపాధి కోసం వలంటీర్‌గా పనిచేస్తున్నారు.
తన సేవల ద్వారా అతి తక్కువ కాలంలోనే గ్రామంలో మంచి పేరు తెచ్చుకుని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం వలంటీర్‌గా పనిచేస్తున్న తానిగడప నిర్మలకుమారి కూడా అమ్మపాలెం ఎంపీటీసీగా గెలుపొందారు. తాను పనిచేస్తున్న నిమ్మలగూడెం గ్రామం అమ్మపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. తన సమీప ప్రత్యర్థి, జనసేన అభ్యర్థి దాసరి ప్రవీణ్‌కుమార్‌పై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఈడీ వరకూ చదివిన నిర్మలకుమారి.. వలంటీర్‌గా తనకున్న అనుభవంతో మరింత సమర్థంగా ప్రజా సేవ చేస్తానని చెప్పారు. ఆమెను ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment