తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎటూ వెళ్లలేని పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడడంతో దసరా సెలవులకు నగరవాసులు పలు పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వస్తోంది.
డీఆర్‌ఎం ప్రత్యేక చర్యలు
పరిస్థితిని గమనించిన వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌ను క్లియర్ చేసే దిశగా ఆయా రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసి బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(సమతా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(కోర్భా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కడప–విశాఖపట్నం(తిరుమల ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం(వీక్లీ స్పెషల్) ఎక్స్‌ప్రెస్‌లకు ఇరువైపులా తాత్కాలికంగా ఒక్కో థర్డ్ ఏసీ కోచ్‌లను జత చేశారు. విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–గా«ంధీదాం–విశాఖపట్నం(ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో స్లీపర్ క్లాస్ కోచ్‌లను, భువనేశ్వర్–విశాఖపట్నం–భువనేశ్వర్(ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. ఇదే విధంగా మరిన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను దసరా వరకు కొనసాగించాలని రైల్వే ప్రయాణికులు కోరతున్నారు.
ప్రత్యేక రైళ్లు నడపాలి
దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హౌరా తదితర మార్గాల్లో దసరా ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రతి ఆది, సోమవారాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ను రెగ్యులర్ రైలుగా మార్చేందుకు డీఆర్‌ఎం కృషి చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారణాసి రైలు గురించి కూడా డీఆర్‌ఎం కృషి చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కాలువలతో చెరువుల అనుసంధానం
Comments
Please login to add a commentAdd a comment