Sajjala Ramakrishna Reddy Says, We Always Ready To Discuss With Employees - Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఆహ్వానం

Published Mon, Jan 24 2022 3:23 PM | Last Updated on Tue, Jan 25 2022 2:54 AM

We Always Ready To Discuss With Employees Sajjala - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, అనవసర ప్రతిష్టంభన సృష్టించొద్దని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైన సందర్భంగా సజ్జల విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కమిటీ వారధిలా పని చేస్తుందని చెప్పారు.

చెప్పడానికైనా రావాలి కదా? 
‘సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ ద్వారా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించాం. కానీ వారు జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వెళ్తామని మీడియాకు చెబుతున్నారు. అదే విషయాన్ని కమిటీకి చెప్పడానికైనా రావాలి కదా? ఉద్యోగులు చర్చలు జరపాలన్నా.. బాధలు వినిపించాలన్నా.. ఈ కమిటీకే నివేదించాలని ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. దీన్ని గుర్తించం అంటే ఎలా? అపోహలు ఉంటే తొలగిస్తాం. సరైన కారణం ఉంటే పునఃసమీక్షిస్తాం. గతంలో ఉద్యోగులను సంతృప్తి పరిచాం. ఇప్పుడు చిన్నచిన్న అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఈరోజు రాలేదు.. రేపు వస్తారేమో చూస్తాం. ఉద్యోగులకు కమిటీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది’ అని సజ్జల పేర్కొన్నారు.

ఉద్యోగులు, ప్రభుత్వం ఒకటే
ఉద్యోగుల ఆందోళనల వెనుక జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కొన్ని వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తాపత్రయపడుతున్నాయని సజ్జల మండిపడ్డారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనూ ప్రజలకు ఎంత మంచి చేశామో ప్రభుత్వం చెబుతోందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమైనప్పుడు వారి గురించి ఇంకొకరి వద్దకు వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. కొత్త జీవోల ప్రకారం జీతాల చెల్లింపు ప్రక్రియ చేపట్టబోమని ట్రెజరీ ఉద్యోగులు పేర్కొనడంపై స్పందిస్తూ మెడ మీద కత్తి పెట్టేలా వ్యవహరిస్తే ఉద్యమ కార్యాచరణకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకే కమిటీ ఏర్పాటైనట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్నారు. కమిటీ సభ్యులైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఢిల్లీ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు.
 
మంత్రుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు
పీఆర్‌సీపై ఉద్యోగులలో నెలకొన్న అపోహలను తొలగించి సందేహాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎస్‌ సమీర్‌ శర్మ 
ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కమిటీలో ఉన్నారు. కమిటీ సభ్య కన్వీనర్‌గా సీఎస్‌ ఉంటారు. కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై పీఆర్సీపై అపోహలను తొలగించడంతో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

పీఆర్సీపై పిటిషన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement