పిఠాపురం, హిందూపురం, బద్వేలులో జరిగినవీ ప్రభుత్వ హత్యలే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
దాడులు, హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
దిశ యాప్ లేకపోవడం వల్లే మహిళలకు భద్రత లేదు
మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment