కుమార్తె చందనతో నాగరత్నమ్మ
‘నా బిడ్డ కొన్నేళ్లుగా థైరాయిడ్‌తో బాధపడుతూ నోటిమాట రావడంలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని ఆరోగ్యశ్రీ ద్వారా నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయడంతో నా బిడ్డ అందరు పిల్లల్లా మాట్లాడుతోంది. నేను సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాను..’
– ఇది ఓ తల్లి సంతోషం
వి.కోట (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చలవతో తన బిడ్డకు మళ్లీ మాటలొచ్చాయని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన నాగరత్నమ్మ సోమవారం మీడియా ముందు ఆనందంగా చెప్పారు. ఇక తమ బిడ్డ బతుకు అంతేనేమోనని ఆవేదనతో బతుకుతున్న తమకు జీవం పోసినట్లయిందని తెలిపారు. ఆమె తెలిపిన మేరకు.. వి.కోట భారత్‌నగర్‌లో ఉంటున్న నాగరత్నమ్మ కుమార్తె చందన (14) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.
చందనకు హైపో థైరాయిడిజం కారణంగా క్రమంగా మాట పోయింది. వారిది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పాప ఆరోగ్యం కోసం వారు శక్తికి మించి ఆస్పత్రుల్లో ఖర్చుచేశారు. అయినా పాపకు మాట రాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అందుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేస్తారేమోనని గతంలో పలుమార్లు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వీలుకాదని అప్పట్లో వైద్యులు తెలపడంతో మందులు వాడుకుంటూ మిన్నకుండిపోయారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీలో అదనంగా పలు వ్యాధులకు చికిత్స చేయిస్తున్నారని తెలిసింది. దీంతో సర్పంచి పీఎన్ లక్ష్మిని ఆశ్రయించారు. సర్పంచి సాయంతో చందనను మార్చి 22న తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు 25వ తేదీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. 29వ తేదీన డిశ్చార్జి చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లి రావడానికి, అక్కడ తమకు అయిన ఖర్చులూ తమ అకౌంట్లో వేస్తామని చెప్పారని నాగరత్నమ్మ తెలిపారు. నిజంగా ఇది పేదల ప్రభుత్వమేనని.. ఆస్పత్రికి వెళ్లాక తెలిసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎంతోమంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ప్రాణం పోస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని తన బిడ్డ ఇప్పుడు అందరు పిల్లల్లా మాట్లాడుతోందని, రోజూ బడికి వెళ్లి చదువుకుంటోందని చెప్పారు. సీఎంకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, జగన్‌మోహన్‌రెడ్డి వంటి సీఎంలు రాష్ట్రంలో ఉన్నంతవరకు పేదల కష్టాలు వారి దరిదాపుల్లో లేకుండా చేస్తారని ఆమె ఆనందంతో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment