ఏపీ ఓ రోల్‌మోడల్‌ | World Bank Director In India Praises CM YS Jagan governance | Sakshi
Sakshi News home page

ఏపీ ఓ రోల్‌మోడల్‌

Published Tue, Mar 28 2023 2:02 AM | Last Updated on Tue, Mar 28 2023 9:02 AM

World Bank Director In India Praises CM YS Jagan governance - Sakshi

ప్రపంచ బ్యాంకు బృందంతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రజలకు మంచి వైద్యం, అత్యు­త్తమ విద్యను ఎలా అందించవచ్చో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి మార్గాన్ని చూపారని భారత్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌ ‘ఆగస్ట్‌ తను కమే’ ప్రశంసించారు. నిర్దేశిత సమ­యంలోగా పౌరులకు సేవలను అందించడంలో గొప్ప ఉదాహరణగా నిలిచారని ముఖ్యమంత్రిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో తపనపడుతున్నారని చెప్పారు.

భారత్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌ ‘ఆగస్ట్‌ తను కమే’ నేతృత్వంలోని బృందం సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశ­మైంది.ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న ప్రాజెక్టులు ‘ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్‌), ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌ (ఏపీఐఐఏటీపీ)లపై  సమీక్షించారు. ఈ సందర్భంగా ఆగస్ట్‌ తను కమే ఏమన్నారంటే..

దేశ సగటుకు మించి వృద్ధి రేటు
రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా తిలకించాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే అంశానికి మీరు (సీఎం జగన్‌) చక్కటి ఉదాహరణగా నిలిచారు. ఇందుకు మన­స్ఫూర్తిగా  అభినందనలు తెలియజేస్తున్నాం. మంచి వైద్యం, ఆరోగ్యం, ఉత్తమ విద్యను ఎలా అందించవచ్చు? అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూ­పారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో గొప్ప ఉదాహరణగా నిలిచారు. 

► దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలి­స్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధి కోసం  రుణాలు ఇస్తున్నాం. మీ రాష్ట్రాన్ని (ఏపీ) మిగి­లిన రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు. రాష్ట్రంతో మా భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోంది. వచ్చే పాతికేళ్లలో మీ విజన్, మిషన్‌కు ఈ సహకారం కొనసాగుతుంది. 2047 నాటికి దేశం మాదిరిగానే రాష్ట్రం కూడా మంచి ఆదాయం కలిగిన ప్రాంతంగా ఎదిగేందుకు మా సహకారం, మద్దతు కొనసాగుతుంది. 

► అత్యంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దేశ సగటు కన్నా ఎక్కువ ఉంది. అభివృద్ధి రేటు చాలా బాగుంది. ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయి. పారిశ్రామిక రంగం, వైద్య రంగాలు ఉన్నాయి. రాష్ట్రంలో సమర్థవంతమైన, డైనమిక్‌ ప్రభుత్వం ఉంది. 

► వరల్డ్‌ బ్యాంకు కలసి ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగా కొనసాగుతున్నాయి. మీరు (సీఎం జగన్‌) అమలు చేస్తున్న చాలా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆరోగ్యరంగంలో టెలిమెడిసిన్, ఆన్‌లైన్‌ సేవలు, ప్రజలకు చేరువగా వైద్యం, స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలవడం.. ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు. 

► విద్యారంగంలో కూడా ప్రపంచబ్యాంకు రాష్ట్రంతో కలిసి పనిచేస్తోంది. ఈ రంగంలో మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ స్ఫూర్తిదాయకులు. రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని తపనపడుతున్నారు. రాష్ట్రంలో మంచి విధానాలు అమలవుతున్నాయి. 

కీలక రంగాలకు మరింత సహకారం: సీఎం జగన్‌
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు మరింత సహకారం అందించాలని సీఎం జగన్‌ కోరారు. సమావేశం సందర్భంగా ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. సత్య నాదెళ్ల లాంటి వారు మరింత మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

► విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరుతున్నా. వీటిల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపురేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ డిజిటల్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నాం.

నాడు – నేడు తొలిదశ పూర్తైన స్కూళ్లలో వచ్చే జూన్‌ కల్లా వీటిని అందుబాటులోకి తెస్తాం. దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మారుస్తున్నాం. ఇది డిజిటలైజేషన్‌ దిశగా వేస్తున్న పెద్ద అడుగు. నాడు– నేడు కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. 

► విద్యార్థుల చేరికలకు సంబంధించి జీఈఆర్‌ రేషియోను పెంచుకుంటూ వెళ్లాలన్నదే మా ఉద్దేశం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో దేశ సగటు కన్నా తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించాం. దీనికోసమే స్కూళ్లలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం. గతంలో ప్రైవేట్‌ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడలేవన్న మాట వినిపించేది. రెండేళ్ల తర్వాత.. ప్రైవేట్‌ స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

► 8వ తరగతి విద్యార్థులకు ట్యాట్‌లు ఇస్తున్నాం. విద్యాభ్యాసాన్ని అత్యంత సులభతరం చేయడానికే ఈ చర్యలు. బైలింగ్యువల్‌ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ ఇస్తున్నాం. విద్యాకానుకలో భాగంగా డిక్షనరీ అందచేస్తున్నాం. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి తీసుకొచ్చాం. పిల్లల హాజరుతో అనుసంధానం చేసి పథకాన్ని అమలు చేస్తున్నాం.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి విద్యార్థిని ట్రాక్‌ చేస్తున్నాం. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. వసతి దీవెన కింద ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో కూడా బాగా మార్పులు తీసుకొచ్చాం. మంచి పౌష్టికాహారం, నాణ్యతతో కూడా భోజనాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల మీద చేసే ఖర్చును మేం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నాం. 

► రాష్ట్ర విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా విదేశీ విద్యా దీవెన కూడా అమలు చేస్తున్నాం. సత్య నాదెళ్ల లాంటి వారు మరింత మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే రావాలన్నది మా ఉద్దేశం. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి. మరో నాలుగు వస్తున్నాయి. పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులు  రాష్ట్రంలోనే తయారవుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామి కావాలని కోరుతున్నా. 

► వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 48 వేలమందికి పైగా సిబ్బందిని నియమించాం. కొత్తగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలవుతోంది. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థంగా అమలు చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. వైద్యం, విద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాం.

రాష్ట్రాన్ని దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. క్షేత్రస్థాయిలో సమస్యలకు సమూల పరిష్కారాలను చూపే దిశగా ముందుకు సాగుతున్నాం.  ప్రపంచబ్యాంకు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరుతున్నా. కేవలం ఆర్థికంగానే కాకుండా మంచి విధానాలను అమలు చేయడంలో, సాంకేతికంగానూ.. ఇలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

► ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎం.టీ.కృష్ణబాబు, ప్రవీణ్‌ ప్రకాష్, శశిభూషణ్‌ కుమార్, సత్యనారాయణ, సురేష్‌ కుమార్, వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ బ్యాంకు బృందంలో ప్రధాన విదేశీ వ్యవహారాల సలహాదారు సుదీప్‌ మజుందార్, ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ టీటీఎల్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కార్తీక్, అగ్రికల్చర్‌ స్పెషలిస్ట్‌ ఆండ్రూ డి.గుడ్‌ల్యాండ్, ప్రాక్టీస్‌ మేనేజర్, ఎంటీఐ హూన్‌ సాహిబ్‌ సోహ్, మానవాభివృద్ధి ప్రోగ్రామ్‌ లీడర్‌ జుంకో ఒనిషి, ఆరోగ్య పోషణ, జనాభా ప్రాక్టీస్‌ మేనేజర్‌ ట్రినా ఎస్‌.హక్యూ, ప్రోగ్రామ్‌ లీడర్‌ భావనా భాటియా తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement